పొలిటికల్ మీటింగ్ లో ప‌వ‌న్ నోట ఓజీ మాట‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వ‌రుస‌గా రీమేక్ మూవీస్ చేయ‌డం అభిమానుల‌ను ఒకింత నిరాశ‌కు గురి చేసింది. ప‌వ‌న్ పొటెన్షియాలిటీకి త‌గ్గ చిత్రాలు చేయ‌ట్లేద‌ని వాళ్లు అసంతృప్తికి గుర‌య్యారు. ఐతే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రూపంలో స్ట్రెయిట్ మూవీ చేసినా.. అది విప‌రీతంగా ఆల‌స్య‌మై, ద‌ర్శ‌కుడి మార్పుతో కంగాళీగా త‌యారై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది.

కానీ త‌ర్వాత వ‌చ్చిన ఓజీ మాత్రం ప‌వ‌న్ అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. ఇది ప‌వ‌న్ కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గానూ నిలిచింది. ఈ సినిమా రిలీజ్ టైంలో ప‌వ‌న్ చాలా ఉత్సాహంగా క‌నిపించారు. ఓజీని బాగా ప్ర‌మోట్ చేశాడు కూడా. కానీ త‌ర్వాత ఎప్ప‌ట్లాగే ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. 

ఐతే తాజాగా ప‌వ‌న్ ఒక పొలిటిక‌ల్ మీటింగ్‌లో ఓజీ సినిమా ప్ర‌స్తావ‌న తెచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. “ఓజీ లాంటి సినిమాలు 2004 తర్వాతే కొట్టేవాళ్ళం మనం.. కానీ అప్పుడు మనకు సినిమాల మీద కంటే సమాజం మీద దృష్టి ఎక్కువ కావడం వల్ల అలాంటి సినిమాలు చెయ్యలేకపోయాం” అని పవన్ అన్నాడు. “ఈ మధ్య మీరు బాధ పడుతున్నారు కాబట్టి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ మీద. మరీ రాజకీయాలు, సినిమా అని మమ్మల్ని ఏడిపిస్తున్నారు, తలెత్తుకోలేక పోతున్నాం అని అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే వారి కోసం ఒక్కసారి ఓజీ మీద దృష్టి పెట్టాను” అని పవన్ పేర్కొన్నాడు. సినిమాలు తన బతుకు తెరువు అయితే రాజకీయాలు తన బాధ్యత అని పవన్ ఈ సందర్భంగా వ్యాఖానించాడు.

మ‌రోవైపు రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌వ‌న్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ తీరు న‌చ్చ‌క 11 సీట్ల‌కు జ‌నం ప‌రిమితం చేశార‌ని.. అయినా వారి తీరుమార‌డం లేద‌ని ప‌వ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అవే బూతులు, ఎదురుదాడిని వైసీపీ వాళ్లు కొన‌సాగిస్తున్నార‌ని.. అధికారంలోకి వ‌స్తే న‌రుకుతాం, చంపుతాం అంటూ మాట్లాడుతున్నార‌ని.. కానీ ఆ పార్టీ అధికారంలోకే రాద‌ని ప‌వ‌న్ అన్నాడు.

ప్ర‌తిప‌క్షం నిర్మాణాత్మ‌క విమ‌ర్శలు చేస్తే వాటిని స్వీక‌రించి త‌ప్పులు దిద్దుకుంటామ‌ని.. కానీ బూతులు మాట్లాడితే కుద‌ర‌ద‌ని.. త‌న‌కు ఎంతో స‌హ‌నం ఉన్న‌ప్ప‌టికీ ప‌దే ప‌దే త‌ప్పులు చేసేవాళ్లను క్ష‌మించ‌న‌ని.. అంద‌రి త‌ప్పుల‌నూ నోట్ చేస్తున్నాన‌ని.. ఒక రోజు త‌న కోపాన్ని చూడాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించాడు.