థియేటర్లు తెరుస్తాం సరే… జనం వస్తారా రారా అనేది ఇంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమను వేధించిన ప్రశ్న. సగం టికెట్లు అమ్మడం ఒకటయితే… ఆ సగం టికెట్లయినా అమ్ముడవుతాయా లేదా, అసలు ఈ కరోనా టైమ్‍లో జనం థియేటర్లలో అడుగుపెడతారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేటి నుంచి హైదరాబాద్‍లో పలు థియేటర్లు ఆపరేట్ అవుతున్నాయి.
మొదటి రోజు ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వెళ్లినట్టు. మిగతా సినిమాల మాట ఎలా వున్నా క్రిస్టఫర్ నొలాన్ సినిమా టెనెట్‍ను థియేటర్‍లో చూసేందుకు జనం తరలి వెళ్లారు. శని, ఆదివారాల బుకింగ్స్ కూడా ఆశాజనకంగానే వున్నాయి. దీంతో విడుదల చేయాలా వద్దా అనే మీమాంసలో వున్న సినిమాల నిర్మాతలు కాస్త ధైర్యం చేయవచ్చు.
అయితే సింగిల్ థియేటర్స్లో తగు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారనేది చెప్పడం కష్టమే. ముఖ్యంగా వాష్ రూమ్‍ల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. మల్టీప్లెక్సులంటే గట్టి చర్యలు చేపట్టాయి కనుక అక్కడికెళ్లి సినిమా చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా భయపడడం లేదని అర్థమయింది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఇదే స్థాయిలో వచ్చినట్టయితే మిడిల్ రేంజ్ సినిమాలను విడుదల చేయడం షురూ చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates