నాగ్ 100.. అక్కినేని ఫ్యామిలీ ధమాకా?

అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. తన పుట్టిన రోజైన ఆగస్టు 29న నాగ్ తన వందో చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని.. ముహూర్త వేడుకను ఘనంగా చేస్తాడని ఫ్యాన్స్ అంచనా వేశారు కానీ.. కింగ్ అలా చేయలేదు. సినిమాకు అనౌన్స్‌మెంటే లేదు. షూటింగ్ కూడా చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేశారు. 

తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. నాగ్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ అయిన ఈ సినిమాలో ఆ కుటుంబం నుంచి ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘మనం’ తరహాలో నాగ్ వందో చిత్రాన్ని కూడా స్పెషల్‌గా మార్చేందుకు అక్కినేని కుటుంబం సన్నాహాలు చేస్తోందట. ఇందులో నాగ్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన టబు కథానాయికగా నటిస్తున్న సంగతి ఇటీవలే వెల్లడైంది. కాగా నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇందులో క్యామియో రోల్స్ చేయనున్నారట. అంతే కాక అమల కూడా చిన్న పాత్రలో మెరిసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే అక్కినేని అభిమానులకు అంతకంటే సంబరం మరొకటి ఉండదు. 

ఏఎన్నార్ చివరి చిత్రమైన ‘మనం’లో నాగ్, చైతూ లీడ్ రోల్స్ చేస్తే.. అఖిల్ క్యామియోలో కనిపించడంతో ఆ చిత్రం చిరస్మరణీయంగా మారింది. ఇప్పుడు నాగ్ వందో సినిమాను కూడా ప్రత్యేకంగా మార్చేలా అక్కినేని ఫ్యామిలీ క్యామియోస్ పెడుతున్నారట. మరి ఇందులో సుమంత్, సుశాంత్, సుప్రియ లాంటి మిగతా అక్కినేని కుటుంబ తారలు కూడా తళుక్కుమని ఈ మూవీని ఇంకా స్పెషల్‌గా మారుస్తారేమో చూడాలి.