అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కోసం రాజమౌళి మార్క్ మార్కెటింగ్ మొదలైపోయింది. ట్విట్టర్ లో నాన్ స్టాప్ గా అప్డేట్స్ పెడుతున్నారు. కొత్త సినిమా రేంజ్ లో కాంటెస్టులు పెట్టి జనాలను అందులో భాగం చేయడం ద్వారా పబ్లిసిటీ అంకానికి తెరతీశారు. ఎడిటింగ్ రూమ్ ఫోటోలు బయటికి వచ్చి అందులో ఐమాక్స్ రేషియో కోసం వేసుకున్న స్టోరీ బోర్డు సైతం కనిపించేలా పిక్స్ వదిలారంటే ఏ స్థాయిలో అటెన్షన్ తెచ్చుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎపిక్ చివర్లో బాహుబలి 3 అనౌన్స్ మెంట్ ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
విశ్వసనీయ సమాచారం మేరకు బాహుబలి 3 లాంటి ప్లాన్ ఏదీ లేదు. ఎందుకంటే చెప్పాల్సిన కథను ఐదున్నర గంటల పాటు రెండు భాగాల్లో చెప్పేశారు. భల్లాలదేవ చనిపోయాడు. దేవసేన వర్తమానంలో వృద్ధురాలయ్యింది. ఇక ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ లేరు. మళ్ళీ కొత్తగా సృష్టించాలి. అసలు ఎస్ఎస్ఎంబి 29 రిలీజయ్యేనాటికి 2027 అయిపోతుంది. ప్రభాస్ చేతిలో రాజా సాబ్ కాకుండా ఫౌజీ, కల్కి 2, సలార్ 2, సందీప్ రెడ్డి వంగా సినిమాలున్నాయి. ఇంకో మూడేళ్ళ వరకు తను కూడా బిజీనే. అంటే బాహుబలి 3 మొదలుపెట్టాలన్నా కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఇదంతా జరిగే పని కానే కాదు.
కాకపోతే ఎపిక్ చివర్లో కలకత్తా పాన్ లాగా ఏదైనా స్వీట్ సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి అలాంటిది జక్కన్న ప్లాన్ చేశారట. ఎండ్ టైటిల్స్ అయ్యాక అది వస్తుందని అంటున్నారు. బాహుబలి కాకుండా వేరే కొత్త ప్రాజెక్టుతో అనౌన్స్ మెంట్ ఉండొచ్చని కొందరు చెబుతుండగా, అసలలా అనౌన్స్ చేయాలా వద్దానే నిర్ణయం రాజమౌళి తీసుకోలేదని అంటున్నారు. ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి చిన్న విజువల్ ఏదైనా పొందుపరచవచ్చని వినికిడి. ఇది కూడా గ్యారెంటీగా చెప్పలేం కాబట్టి ఇంకో పాతిక రోజులు వెయిట్ చేయాల్సిందే. వచ్చే వారం నుంచి బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ భారీ ఎత్తున స్టార్ట్ కాబోతున్నాయి. సెలబ్రేషన్స్ కి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates