అనిల్ సినిమాలో చిరు విల‌న్ ఎవ‌రు?

స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎవ‌రనే విష‌యంలో ఎంత ఆస‌క్తి ఉంటుందో.. విల‌న్ విష‌యంలోనూ జ‌నాల్లో అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే… అవ‌త‌ల ఆయ‌న‌కు దీటుగా నిల‌బ‌డే విల‌న్ ఎవ‌రా అని చూస్తారు. ఐతే సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరుకు ఎదురుగా స‌రైన విల‌న్లు ఉండ‌ట్లేద‌నే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఐతే అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం బ‌ల‌మైన విల‌న్నే ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ద‌స‌రా చిత్రంతో తెలుగులోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో.. మ‌న శంక‌ర వర ప్ర‌సాద్ చిత్రంలో చిరును ఢీకొడుతున్నాడ‌ట‌.

ద‌స‌రా త‌ర్వాత షైన్ మీద భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి కానీ.. దేవ‌ర‌, ఢాకు మ‌హారాజ్ లాంటి సినిమాల్లో త‌న‌కు స‌రైన పాత్ర‌లు ప‌డ‌లేదు. మామూలుగా అనిల్ సినిమాలంటే సీరియ‌స్ విల‌న్లు ఉండ‌రు. విల‌న్ల‌తో కూడా ఎక్కువ‌గా కామెడీనే చేయిస్తుంటాడు. మ‌రి త‌న సినిమాలో షైన్ చాకో లాంటి సీరియ‌స్ విల‌న్ని పెట్టి ఏం చేయిస్తాడో చూడాలి. డ్ర‌గ్స్, ఇత‌ర వివాదాల కార‌ణంగా షైన్ చాకోకు ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గాయి. ఢాకు మ‌హారాజ్ త‌ర్వాత తెలుగు సినిమాల్లో కూడా క‌నిపించ‌లేదు. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో అత‌ను టాలీవుడ్లోకి రీఎంట్రి ఇవ్వ‌బోతున్నాడు.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా మీసాల పిల్లా అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పంద‌నే వ‌స్తోంది. ఈ పాట మీద కొంత ట్రోలింగ్ కూడా జ‌రిగిన‌ప్ప‌టికీ ఎక్కువమంది సానుకూలంగానే స్పందిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ సింగ‌ర్ ఉదిత్ నారాయ‌ణ ఈ పాట‌ను ఆల‌పించారు. చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బేన‌ర్ మీద సాహు గార‌పాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరు త‌న‌యురాలు సుష్మిత కొణిదెల కూడా ఇందులో నిర్మాణ భాగ‌స్వామి.