ఓజస్ గంభీర… అసలు పరీక్ష మొదలాయెరా

లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని గురువారం విడుదలైన ఓజి అనుకున్న దానికన్నా బాగా పెర్ఫార్మ్ చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. రెండు వందల కోట్ల గ్రాస్ సునాయాసంగా దాటేయగా,. ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్కు వైపు పరుగులు పెట్టడం కొత్త మైలురాళ్లను తెస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో అత్యధిక డిస్ట్రిబ్యూటర్లు జీవో ప్రకారం పెంచిన రేట్లనే సోమవారం నుంచి కూడా కొనసాగించడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెంటర్స్ లో తగ్గించినప్పటికీ ప్రధాన కేంద్రాల్లో మాత్రం టికెట్ మీద 100, 150 రూపాయల పెంపు అలాగే కనిపిస్తోంది.

దీని వెనుక కారణం దసరా సెలవులే. స్కూళ్ళు, కాలేజీలు హాలిడేస్ లో ఉన్నాయి. పిల్లలు ఇంటి పట్టునే ఉన్నారు. యూత్ కి ఖాళీ సమయం చాలా ఉంది. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు పది రోజుల పాటు అవే ధరలే పెట్టే ఉద్దేశంతో ఉన్నారట. మూడు నాలుగు వారాల్లో ఉన్న మిరాయ్, లిటిల్ హార్ట్స్ కు సైతం మంచి ఆక్యుపెన్సీలు కనిపించడానికి కారణం ఏమిటో చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ దృష్ట్యా పెంచిన మొత్తాన్ని భరించి మరీ ఆడియన్స్ వస్తారనే ధీమా నిర్మాత, బయ్యర్లలో కనిపిస్తోంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అంత స్థాయిలో లేవనేది పరిశీలించాల్సిన విషయం.

సరే ఎవరి పట్టు వారిదే కానీ ఒకవేళ ఓజి కనక నెమ్మదించకపోతే వీక్ డేస్ పరీక్షలో ఫస్ట్ క్లాసులో పాసైనట్టే. ఎందుకంటే అక్టోబర్ 5 దాకా సెలవులున్నాయి. కాంతార చాప్టర్ 1, ఇడ్లి కొట్టు రూపంలో కొత్త పోటీ వస్తున్నప్పటికీ అవి డబ్బింగ్ సినిమాలు కాబట్టి పవన్ మూవీనే జనాలకు ఫస్ట్ ఛాయస్ అవుతుందనే నమ్మకం ఎగ్జిబిటర్లలో ఉంది. ఒకవేళ ఓజి కనక ఇవాళ్టి నుంచి రెగ్యులర్ రేట్లకు వచ్చేసి ఉంటే మాస్ బుకింగ్స్ తో పాటు వరసగా హౌస్ ఫుల్స్ పడేవన్న అభిప్రాయాన్ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. థియేటర్ ఫైనల్ రన్ ఇంకా దూరంలో ఉంది కాబట్టి పవన్ కెరీర్ బెస్ట్ నెంబర్స్ వస్తాయో లేదో వేచి చూడాలి.