యానిమల్, చావా బ్లాక్ బస్టర్ల పుణ్యమాని హీరోయిన్ రష్మిక మందన్న నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా సుపరిచితురాలయ్యింది. సల్మాన్ ఖాన్ సికందర్ డిజాస్టర్ అయినా అవకాశాలకు లోటు లేదు కానీ అక్టోబర్ లో తను నటించిన తమ్మా విడుదల కానుంది. స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్యా నిర్మించిన మాడాక్ నిర్మాణ సంస్థ కావడంతో అంచనాలు బాగానే ఉండబోతున్నాయి. అందులోనూ హారర్ సిరీస్ కాబట్టి మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం బయ్యర్లలో ఉంటుంది. ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించిన తమ్మాలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా నవాజుద్దీన్ సిద్ధిక్ కీలకమైన విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇవాళ ట్రైలర్ వచ్చింది.
కథేంటో అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు. వేల సంవత్సరాల వెనుక నుంచి వచ్చిన ఒక డ్రాకులా మెల్లగా మనుషుల్లో చేరుతుంది. ఆడపిల్ల రూపంలో కనిపించిన ఈమెను చూసి హీరో ఇస్టపడతాడు. కట్ చేస్తే అతనూ డ్రాకులాగా హఠాత్తుగా పళ్ళు పదునుగా మారిపోయి అవతలి వాళ్ళను భయపెడుతూ ఉంటాడు. ప్రియురాలి వల్లే ఈ పరిస్థితి వచ్చినా ఆమెను వదులుకోలేనంత ప్రేమిస్తాడు. అసలు ప్రమాదం అక్కడి నుంచి మొదలవుతుంది. లవర్ మంచితనాన్ని ఆమె అర్థం చేసుకున్నా భూమిని నాశనం చేసే లక్ష్యంతో ఉన్న ఒక దుర్మార్గుడు వీళ్లకు అడ్డుగా నిలుస్తాడు. ఆ తర్వాత జరిగేది థియేటర్లలో చూడాలి.
డ్రాకులా సిరీస్ కు హాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో ఎప్పుడు సినిమా వచ్చినా ఖచ్చితంగా చూసే ఆడియన్స్ ఉంటారు. కాకపోతే అవన్నీ సీరియస్ గా జరుగుతాయి. కానీ తమ్మలో డ్రాకులాతో కామెడీలు చేయించారు. మాడాక్ నిర్మిస్తున్న హారర్ సినిమాలన్నీ ఒక యునివర్స్ గా మారుస్తున్నారు. అన్ని దెయ్యాలు, విచిత్ర జంతువులు ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత చివరి భాగంలో కలుస్తాయి. అందుకే తమ్మలో స్త్రీ, భేడియా రెఫరెన్సులు వాడేశారు. రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా రష్మిక మందన్న ఎంచుకున్న ఈ కొత్త జానర్ తనకు ఎలాంటి ఫలితం ఇవ్వనుందో అక్టోబర్ 21 తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates