ఓజి మేనియాలో అభిమానులే కాదు సగటు యూత్ కూడా మునిగి తేలుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసుల కోసం ఏర్పడిన తాకిడి చూసి నిర్వాహకులకు నోటమాట రావడం లేదు. ముప్పై నుంచి నలభై వేల మందికి సౌకర్యం కలిగించే అవకాశం ఉన్న ఎల్బి స్టేడియంకి ఎంతలేదన్నా లక్ష దాకా ఫ్యాన్స్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈవెంట్ సాయంత్రం అయినప్పటికీ మధ్యాహ్నం నుంచే గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన పబ్లిక్ ని చూసి అప్పటికప్పుడు భద్రతను పెంచాల్సి వచ్చింది. మైదానం చుట్టుపక్కల ప్రాంతాలకు ట్రాఫిక్ జామ్స్ ఉంటాయని ముందుగానే ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.
ఇంకోవైపు ప్రీమియర్ షోల టికెట్లు ఆన్ లైన్ లో పెట్టకముందే ఆఫ్ లైన్ లో లక్షల రూపాయలకు వీరాభిమానులు ఫస్ట్ టికెట్ ని పాడేసుకుంటున్నారు. జనసేన విరాళం కోసమే అయినప్పటికీ మొదటి టికెట్ అనే క్రేజ్ క్షేత్ర స్థాయిలో మాములుగా లేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాల మొదటి రోజు థియేటర్ సిబ్బంది పోలీసులకు రిక్వెస్ట్ చేసుకుని సెక్యూరిటీ పెట్టించుకోవడం మాములే. ఈసారి కనీసం రెండు మూడింతలు ఎక్కువ పోలీస్ బలగాలు ప్రతి హాలు దగ్గర అవసరం అయ్యేలా ఉంది. ఆ స్థాయిలో జనం తొక్కిడి ఉంటుందని, రక్షణ కల్పించడం పెద్ద సవాలేనని డిపార్ట్ మెంట్ టాక్.
ట్రైలర్ చెప్పిన టైంకి రాకపోయినా, పవన్ డైలాగులతో కూడిన ఒక్క వీడియో కంటెంట్ వదలకపోయినా ఓజి మీద ఇంత హైప్ ఏర్పడం ఊహాలకు అందనిది. టైటిల్ ప్రకటన స్టేజి నుంచే దీని మీద బజ్ బంగారం ధరలా పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. నిర్మాణంలో ఆలస్యం జరిగినా, దీనికన్నా హరిహర వీరమల్లు రిలీజై డిజాస్టరైనా వాటి ప్రభావం కించిత్ కూడా పడలేదు. సరికదా ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంది. మాములుగా వందల కోట్లతో తీసిన ప్యాన్ ఇండియా మూవీస్ కి మాత్రమే ఉండే ఇలాంటి ప్రీ రిలీజ్ హైప్ ఓజికి రావడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ పవర్ ఏంటో అర్థమవుతోందిగా.
Gulte Telugu Telugu Political and Movie News Updates