పవన్.. నాలుగు నెలల్లో మూడు సినిమాలు

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం ఒక నటుడు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జనసేన పార్టీకి అధినేత. ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి. ఆయన చేతిలో నాలుగు శాఖలు ఉన్నాయి. మరి రాజకీయంగా ఆయన ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి నాలుగు నెలల వ్యవధిలో మూడు పెండింగ్ సినిమాల చిత్రీకరణను పూర్తి చేయడం విశేషం.

ఆయన 2024 ఎన్నికల కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వడానికి మూడు చిత్రాలు వివిధ దశల్లో ఆగిపోయిన సంగతి తెలిసిందే. అవే.. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు చిత్రాల కోసం అతి కష్టం మీద వీలు చేసుకుని.. ఈ ఏప్రిల్ నుంచి ఆయన షూటింగ్‌లకు హాజరు కావడం మొదలుపెట్టారు. ముందుగా మేలో ‘వీరమల్లు’ షూట్ పూర్తయింది. ఆ చిత్రం జులై చివర్లో థియేటర్లలోకి కూడా దిగింది.

ఆ తర్వాత పవర్ స్టార్ ‘ఓజీ’ సెట్లోకి అడుగు పెట్టారు. మధ్య మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటూ మూడు వారాల పాటు చిత్రీకరణకు హాజరయ్యారు. ఆ సినిమాను కూడా జూన్లోనే పవన్ అవగొట్టేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. పవన్ జూన్ నెలలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా తిరిగి పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. స్పీడ్ డైరెక్టర్‌గా పేరున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆ సినిమాను కూడా శరవేగంగానే పవన్ పూర్తి చేసేశాడు. తన పార్ట్ షూటింగ్ తాజాగా పూర్తయింది.

ఈ సందర్భంగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ రాశి ఖన్నా, ఇతర టీంతో కలిసి పవన్ సెల్ఫీ కూడా దిగారు. దాన్ని రాశినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ వరకు ఇక తీయాల్సిన సీన్లేవీ లేవు. వేరే నటీనటులతో ముడిపడ్డ సన్నివేశాలను కొంచెం తీరిగ్గా తీసుకునే అవకాశముంది హరీష్‌కు. పవన్ అయితే తన పని పూర్తి చేసేశాడు. ప్రస్తుతానికి ఆయనకు చేతిలో వేరే కమిట్మెంట్లు అయితే లేదు. ఓవైపు ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటూనే.. ఇంకోవైపు ఎంతో కష్టపడి షూటింగ్‌లకు హాజరైన పవన్.. ఇక కొంచెం రిలాక్సవవ్వొచ్చు. పూర్తిగా రాజకీయాల మీదే దృష్టిపెట్టొచ్చు.