నానితో మోహ‌న్ బాబు.. ఇది క‌దా కాంబినేష‌న్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల్లో మోహ‌న్ బాబు ఒక‌రు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. ఏ పాత్ర చేసినా త‌న‌దైన ముద్ర వేసి ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తారు ఈ లెజెండ‌రీ న‌టుడు. ముఖ్యంగా ఆయ‌న విల‌నిజం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐతే గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి ఆయ‌న సినిమాలు త‌గ్గించేశారు. మోహ‌న్ బాబు ఆస‌క్తి లేదా.. ఆయ‌న్ని ఎవ‌రూ అడ‌గ‌ట్లేదా అంటే స‌మాధానం చెప్ప‌డం క‌ష్టం. కార‌ణం ఏదైనా స‌రే.. అలాంటి గొప్ప న‌టుడు త‌ర‌చుగా సినిమాలు చేయ‌క‌పోవ‌డం మాత్రం అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మే. 

అప్పుడ‌ప్పుడూ సొంత బేన‌ర్లో తన స్థాయికి త‌గ‌ని సినిమాలు, పాత్ర‌లే చేస్తున్నారు మోహ‌న్ బాబు. ఇలాంటి టైంలో డైలాగ్ కింగ్‌ ఒక క్రేజీ మూవీలో న‌టిస్తున్న విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఆ చిత్ర‌మే.. నాని హీరోగా న‌టిస్తున్న ది ప్యార‌డైజ్. ఈ సినిమాలో మోహ‌న్ బాబు న‌టిస్తున్న విష‌యాన్ని ఆయ‌న త‌న‌యురాలు మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న అనుకోకుండా ఒక కార్య‌క్ర‌మంలో బ‌య‌ట‌పెట్టేసింది. ఇందులో పాత్ర కోసం మోహ‌న్ బాబు త‌న అవ‌తారాన్ని కూడా మార్చుకుంటున్న విష‌యాన్ని ఆమె వెల్ల‌డించింది. నాని లాంటి క్రేజీ హీరో, ద‌స‌రా ద‌ర్శ‌కుడితో క‌లిసి చేస్తున్న ది ప్యార‌డైజ్‌కు మామూలు హైప్ లేదు. ఈ సినిమాతో నాని నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోతాడ‌నే అంచ‌నాలున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ సంచ‌ల‌నం రేపింది. 

ఇలాంటి రా అండ్ ర‌స్టిక్ మూవీలో మోహ‌న్ బాబు లాంటి గొప్ప న‌టుడు ఓ బ‌ల‌మైన పాత్ర చేశాడంటే దానికి వ‌చ్చే వెయిటే వేరుగా ఉంటుంది. సినిమాకు కూడా అది పెద్ద ప్ల‌స్ అవ‌డం ఖాయం. మోహ‌న్ బాబు ఇలాంటి ట్రెండీ సినిమాల్లో, న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో తెలుగు విల‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో ఓ మంచి పాత్ర‌తో క‌మ్ బ్యాక్ ఇస్తే మోహ‌న్ బాబుకు తిరుగుండ‌దు. ఒక వేళ ఈ సినిమాలో ఆయ‌న విల‌న్ పాత్ర చేశాడంటే నాని వెర్స‌స్ మోహ‌న్ బాబు క్లాష్‌కు వ‌చ్చే క్రేజ్ కూడా వేరుగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.