దర్శకులను తెలివిగా వాడేసుకున్నారు

మిరాయ్ లో కొంచెం కామెడీ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటుంది. దాన్ని చేసిన నటుడిని చాలా మంది గుర్తించలేకపోయారు. యాక్టింగ్ పరంగా ఇబ్బంది పడుతున్న వైనం కనిపించినప్పటికీ ఓవరాల్ గా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అతనెవరో కాదు కిషోర్ తిరుమల. ఇప్పటిదాకా డైరెక్షన్ కు మాత్రమే పరిమితమైన ఈయన హఠాత్తుగా యాక్టర్ గా ఎందుకు మారారంటే దీని వెనుకో కారణం కనిపిస్తోంది. రవితేజతో సినిమా తీస్తున్న కిషోర్ తిరుమల పనితనం చూసి బహుశా హీరో రికమండేషన్ తోనే మిరాయ్ లో ఛాన్స్ కొట్టేసినట్టు అనుకోవచ్చు.

ఈగల్ నుంచి రవితేజకు కార్తీక్ ఘట్టమనేనితో ఏర్పడ్డ చనువు ఇప్పుడు కిషోర్ ని మిరాయ్ లో భాగం చేసిందని ఇన్ సైడ్ టాక్. ఇదే సినిమాలో కనిపించిన ఇంకో నటుడు వెంకటేష్ మహా. తనకు యాక్టింగ్ కొత్త కాదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం తను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో దర్శకుడిగా వేరే ప్రాజెక్టు లేనప్పటికీ భవిష్యత్తులో ఒక కాంబో అయితే ఉందని ఆల్రెడీ టాక్ ఉంది. సో ఆ అనుబంధంతో స్పెషల్ ఆఫీసర్ గా కనిపించి ఉండొచ్చు. అయితే నిడివి దృష్ట్యా వెంకటేష్ మహా, కిషోర్ తిరుమలకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో తమకు చేతనైంది చేశారు.

వీళ్ళే కాదు అవకాశం దొరికినప్పుడు తెరమీద కనిపించాలనే కోరిక చాలా మంది దర్శకులకు ఉంటుంది. దాసరి నారాయణరావు లాంటి గ్రేట్ యాక్టర్ ని సృష్టించింది ఆ ఆకాంక్షే. ఈయనతో పైన చెప్పిన వాళ్ళను పోల్చడం ఎంత మాత్రం సబబు కాదు కానీ పనిలో పని మిరాయ్ లో కార్తిక్ ఘట్టమనేని కూడా కనిపించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయినా దర్శకత్వం, ఛాయాగ్రహణం రెండు బాధ్యతలు నెత్తిన వేసుకున్నప్పుడు ఇంకో రోల్ నిర్వహించడం కష్టం. ఏది ఏమైనా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మిరాయ్ వసూళ్ల పరంగా పెద్ద స్థాయికే వెళ్లేలా ఉంది.