కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్ డౌన్ షరతులు దశల వారీగా తొలగిపోతూ వచ్చాయి. దాదాపు అన్ని వ్యాపారాలూ యధావిధిగా నడుస్తున్నాయి. ఎక్కడా దేనికీ అడ్డంకుల్లేవు. జనాలు స్వయంగా జాగ్రత్తలు పాటిస్తే పాటించినట్లు.. అంతే తప్ప నిర్బంధంగా ఏదీ అమలు చేసే పరిస్థితి లేదు.
మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి అంటూ నినాదాలు ఇవ్వడం మినహాయిస్తే ఎక్కడా కఠినంగా షరతులు అమలు చేయట్లేదు. రెస్టారెంట్లు, మాల్స్, దుకాణాలు.. ఇలా అన్నీ ఏ షరతుల్లేకుండా సాగిపోతున్నాయి. కానీ ఒక్క థియేటర్ల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుండటం ఆ రంగాన్ని నమ్ముకున్న వాళ్లకు రుచించట్లేదు. ఓ పక్క బస్సులు, రైళ్లు, విమానాలు, రెస్టారెంట్లు.. ఇలా ప్రతి చోటా 100 శాతం ఆక్యుపెన్సీ నడుస్తుంటే ఒక్క థియేటర్లలో మాత్రం 50 శాతం కెపాసిటీతోనే సినిమాలు ఆడించాలన్న షరతు విషయంలో అంత పట్టుదల ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్నికల హడావుడి నెలకొంది. వివిధ పార్టీల నేతలు ఉద్ధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఎక్కడా సామాజిక దూరం పాటిస్తున్న సంకేతాలే లేవు. ఒకే చోట వేలమంది గుమిగూడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య నేతల ప్రచారం సాగుతోంది. అందరూ ఒకరినొకరు అతుక్కునే కనిపిస్తున్నారు. అందులో ఎంతమంది మాస్కులు ధరించారన్నది పట్టించుకోవట్లేదు.
కానీ థియేటర్లలోకి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకునేలా, శానిటైజర్ వాడేలా చూసేందుకు అవకాశం ఉంది. సీటుకు, సీటుకు మధ్య కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది. అలాంటపుడు థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తే వచ్చే సమస్యేంటి? మిగతా అన్ని చోట్లా పోలిస్తే ఇక్కడే షరతులు పాటించి జాగ్రత్తగా సినిమాలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా ఆ రంగాన్ని ప్రభుత్వాలు కరుణించట్లేదు.
50 శాతం ఆక్యుపెన్సీ అంటే కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు రారు. అవి లేకుండా థియేటర్లలో సందడి ఉండదు. ప్రేక్షకులు థియేటర్లకు రారు. కాబట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులిచ్చినా ఒక్కటే లేకున్నా ఒక్కటే. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కరుణించి ఆ రంగాన్ని నమ్ముకున్న వాళ్లను ఆదుకోవాల్సిన అవసరముంది.