కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే ఎన్ని సమాధానాలు పెండింగ్ లో ఉన్నాయో అర్థమవుతుంది. కొన్నేళ్ల క్రితం గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ ఉదయం షో మొదలుపెట్టడానికి గంట ముందు వాయిదా పడటం ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. బి గోపాల్, నయనతార, మణిశర్మ లాంటి బలమైన ప్యాడింగ్ ఉన్నప్పటికీ తీవ్ర ఆర్హిక చిక్కుల్లో ఇరుక్కోవడం కథలుగా చెప్పుకున్నారు. నాగార్జున ఢమరుకం గురించి అక్కినేని ఫ్యాన్స్ నిద్రలో లేపి అడిగినా చెబుతారు. చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయిన చరిత్ర దానికుంది.
జూనియర్ ఎన్టీఆర్ నరిసింహుడు, కమల్ హాసన్ విశ్వరూపం – ఉత్తమ విలన్, చిరంజీవి అంజి, బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు, అనుష్క అరుంధతి, రవితేజ క్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు అవుతుంది. ఇవన్నీ తర్వాతి రోజుల్లో రిలీజైనవే. ఇప్పుడే కాదు ఎన్టీఆర్ కాలంలో లవకుశ సైతం నిర్మాణంలో సమస్యలు ఎదురుకుని ఆరేళ్ళు షూటింగ్ చేసుకుంది. ఇక్కడ కామన్ గా కనిపించే పాయింట్ ఒకటే. ఫైనాన్షియల్ ఇష్యూస్. తీసుకున్న అప్పులు, మిగిలిపోయిన బాకీలు సకాలంలో చెల్లించలేక కోర్టు ద్వారా మొట్టికాయలు తిన్న నిర్మాతలు టాలీవుడ్ హిస్టరీలో పదుల సంఖ్యలో కాదు వందల్లో ఉంటారు.
పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలకే ఇలాంటి చిక్కులు రావడం గమనించవచ్చు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ఒక ప్యాన్ ఇండియా మూవీకి రెండు వందల కోట్ల సెటిల్ మెంట్ ఒకటి పెండింగ్ ఉందట. అది కనక టైంకి పరిష్కరించుకోకపోతే దానికీ అఖండ 2 లాంటి పరిస్థితే ఎదురు కావొచ్చని ఇండస్ట్రీ వర్గాల గుసగుస. ఇలాంటి జరగడం వల్ల ఫ్యాన్స్ ఎమోషన్స్ మాత్రమే దెబ్బ తినడం కాదు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతారు. చరిత్ర ఇలా చాలాసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాటిని గుర్తించడంలో ప్రొడ్యూసర్లు విఫలం కావడం వల్లే అఖండ 2 లాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates