శ్రీను వైట్ల… ది మోస్ట్ లక్కీ డైరెక్టర్

ఇండస్ట్రీలో హీరోకైనా ఇంకెవరికైనా మార్కెట్ ని కొలిచేందుకు సక్సెసే ప్రామాణికం. ఇది ఉంటేనే జనంలో ఆసక్తి ఉంటుంది, బయట మంచి రేట్ పలుకుతుంది. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఎవరైనా దూరంగా ఉండటం సహజం. వివి వినాయక్, ముప్పలనేని శివ లాంటి ఒకప్పటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు ఇప్పుడెందుకు సినిమాలు తీయడం లేదంటే నిర్మాతలు ముందుకు రాకపోవడమే. కానీ శ్రీను వైట్ల సుడి బ్రహ్మాండంగా ఉంది. ఈయన నుంచి చివరిగా వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం బాద్షా. 2013లో రిలీజైన ఈ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయిపోయి నిర్మాతను సేఫ్ చేసింది.

దీని తర్వాత శ్రీను వైట్ల మళ్ళీ తన స్థాయి మేజిక్ చేయలేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వరసగా ఒకదాన్ని మించి మరొకటి చాలా చేదు ఫలితాలను చూశాయి. దెబ్బకాయన ఏకంగా ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని గత ఏడాది గోపీచంద్ విశ్వంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏదో ప్రమోషన్లలో హడావిడి చేశారు కానీ ఇది కూడా హిట్టు కిందకు రాదు. కొన్ని సెంటర్స్ లో ఓ మోస్తరుగా ఆడింది కానీ మరీ టీమ్ చెప్పుకున్నంత నెంబర్లు రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు నితిన్ కాంబోలో శ్రీను వైట్లకో సినిమా సెట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అది కూడా మైత్రి లాంటి బడా బ్యానర్ అంటే మాటలు కాదు.

ఈ అవకాశాన్ని శ్రీను వైట్ల సంపూర్ణంగా వాడుకోవాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి చాలా మంచి సబ్జెక్టు రాసుకున్నారట. మొత్తం తానే కాకుండా యంగ్ రైటర్లను పెట్టి డిఫరెంట్ గా అనిపించే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని తెలిసింది. అందుకే ఫ్లాప్ కాంబో అనే కామెంట్స్ వచ్చినా పర్వాలేదంటూ నితిన్ – శ్రీను వైట్లను కలిపేందుకు మైత్రి సిద్దపడినట్టు వినికిడి. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీను వైట్లకిది డూ ఆర్ డై సిచువేషన్. తన సమకాలీకులు ఎవరికీ దక్కని లక్కు దొరికింది. సంపూర్ణంగా వాడుకుని మళ్ళీ తన ఒరిజినల్ స్టైల్ బయటికి తీస్తే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించవచ్చు.