చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సెప్టెంబర్ 12 కిష్కిందపురితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. దెయ్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న సువర్ణ మాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్ లోకి సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఓ మిత్రబృందం దిగుతుంది. ముందు సరదాగా మొదలైన ప్రయాణం ఊహించని మలుపులు తిరిగి ప్రమాదాలతో ప్రాణాల మీదకు తెస్తుంది. ఆ తర్వాత ఏమయ్యిందనేది స్టోరీ.
అరటిపండు వలిచినట్టు స్టోరీ ఇంత నీట్ గా చెప్పారంటే అసలు కంటెంట్ లో చాలా ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. చివరి షాట్ లో హాస్పిటల్ బెడ్ మీద అనుపమనే దెయ్యంగా చూపించడం లాంటివి ఆసక్తి రేపుతున్నాయి. రాజుగారి గది, మంత్ర, గీతాంజలి, మంగళవారం, విరూపాక్ష ఛాయలు అన్నీ కలిసినట్టు కనిపిస్తున్నప్పటికీ ఇంటెన్సిటీ చూపడంలో కౌశిక్ నేర్పరితనం అంచనాలు రేపుతోంది. రాక్షసుడు తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి చేసిన మూవీ ఇది. చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్లతో భయం పుట్టించేలా సాగింది.
ఇక ట్రైలర్ సంగతి కాసేపు పక్కపెడితే కిష్కిందపురికి సెప్టెంబర్ 12 న మిరాయ్ రూపంలో పెద్ద పోటీనే స్వాగతం చెబుతోంది. వేర్వేరు జానర్లు అయినప్పటికీ రెండు సినిమాలు విఎఫ్ఎక్స్ మీద ఆధారపడినవి కావడం గమనించాల్సిన విషయం. కాకపోతే కిష్కింధపురిలో హారర్ ఎలిమెంట్స్ డామినేట్ చేస్తుండగా మిరాయ్ లో ఫాంటసీ అంశాలకు పెద్ద పీఠ వేశారు. పవన్ కళ్యాణ్ ఓజి వస్తున్న రెండు వారాల ముందు తలపడుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. హిట్టు కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు దర్శకుడికీ ఇది హిట్ కావడం చాలా అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates