పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజి టీమ్ నిమిషం నిడివి ఉన్న చిన్న టీజర్ ని విడుదల చేసింది. విలన్ ఇమ్రాన్ హష్మీ చెప్పే డైలాగులు, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అధిక శాతం విజువల్స్ నింపేసి చివరిలో కత్తి పట్టుకున్న ఓజాస్ గంభీరని లాంచ్ చేయడం ద్వారా ఒక్కసారిగా ఎలివేషన్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా సంగీత దర్శకుడు తమన్ జపనీస్ శైలిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడం విభిన్నంగా ఉంది. హింస ఏ రేంజ్ లో ఉంటుందో ఫాస్ట్ గా పరిగెత్తించిన షాట్స్ ని కొంచెం నెమ్మదించి చూస్తే అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఫ్యాన్స్ అయితే దీంతో హ్యాపీనే.
నిజానికి ఇంకొంచెం ఎక్కువ లెన్త్ తోనే టీజర్ కట్ చేశారని, కానీ ట్రైలర్ ని మరింత క్రేజీగా మార్చడానికి కొన్ని షాట్స్ ని ఇప్పుడు తీసేశారని వినికిడి. ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న ఓజికి సెటిల్డ్ హైప్ ఉండేలా డివివి టీమ్ జాగ్రత్త పడుతోంది. బజ్ మరీ మితిమీరిపోతే అర్ధరాత్రిళ్ళు ప్రీమియర్ షోలు చూస్తున్న ఆడియన్స్ టాక్ ని ఇంకోలా బయటికి తెస్తుండటంతో ఒక ప్రణాళిక ప్రకారం వీడియో కంటెంట్ ఇస్తున్నట్టు తెలిసింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కువ సర్ప్రైజ్ లు ఇవ్వడమే మేలని భావించి దానికి అనుగుణంగానే దర్శకుడు సుజిత్ ప్రమోషన్ కంటెంట్ దగ్గరుండి చూసుకుంటున్నాడట.
సెప్టెంబర్ 25కి ఇంకో ఇరవై మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీని మెల్లగా పీక్స్ కి తీసుకెళ్ళబోతున్నారు. సుజిత్ కు సాహో టైంలో కలిగిన అనుభవాలను వాడుకుని ఈసారి పొరపాట్లు లేకుండా చూసుకుంటున్నాడట. పోటీ లేకుండా సోలో రిలీజ్ కావడంతో ఏపీ తెలంగాణ థియేటర్లు కలెక్షన్ల సునామి కోసం ఎదురు చూస్తున్నాయి. టాక్ ఏ మాత్రం బాగున్నా కనీసం నెల రోజుల పాటు ఎగ్జిబిటర్లకు చింత ఉండదు. అసలే రెండు నెలల నుంచి వారాల తరబడి హౌస్ ఫుల్స్ చేసిన స్టార్ హీరో సినిమా రాలేదు. ఓజి ఆ లోటుని పూర్తిగా తీరుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దాన్ని నిలబెట్టుకోవడమే బ్యాలన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates