జన నాయకుడుని ఎలా అర్థం చేసుకోవాలి

రాజకీయ రంగప్రవేశానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు వచ్చే ఏడాది జనవరి 9 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు ప్రభాస్ ది రాజా సాబ్ వస్తుందని నిన్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించడంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకే రోజు ఈ క్లాష్ కోరుకోవడం లేదు. జన నాయకుడుని తక్కువంచనా వేస్తున్నారా అంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులను రెచ్చగొట్టడం కనిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ ఇవి మరింత వింత రూపాల్లోకి మారతాయని వేరే చెప్పనక్కర్లేదు.

ఇక్కడ సమస్య ఏంటంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు స్ట్రాంగ్ గా ఉండటం. విజయ్ కోసం తమిళనాడు ఎగ్జిబిటర్లు సంపూర్ణ మద్దతుతో ఎక్కువ థియేటర్లు వచ్చేలా చూస్తారు. అయితే పొలిటికల్ గా అధికార పార్టీతో వైరం పెట్టుకున్న విజయ్ కు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ తో టర్మ్స్ సరిగా లేవు. తమిళనాడులో ఏ సినిమాకైనా డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆధిపత్యం చెలాయిస్తున్న రెడ్ జయంట్ కంపెనీ వీళ్లదే. దీని మద్దతు లేకుండా ఎక్కువ స్క్రీన్లు రాబట్టుకోవడం కష్టం. అందుకే ఇది రాజా సాబ్ కు మేలు చేకూర్చే పరిణామం అవుతుందని విశ్లేషకుల అంచనా.

సరే ఇదంతా ఎంత చేసినా విజయ్ ఫాలోయింగ్ ముందు అవి నిలవడం కష్టమే కానీ జన నాయకుడుకి ఇప్పుడు హైప్ లేనట్టు కనిపించినా రిలీజ్ టైంకి లెక్కలు మారిపోతాయి. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేకేననే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. టీమ్ ఖండిస్తూ వస్తోంది. అయితే థియేటర్ లో మొదటి ఆట చూశాక కానీ దీనికి సంబంధించిన క్లారిటీ రాదు. రాజా సాబ్ కు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాలంటే మార్కెటింగ్ చాలా అవసరం. దసరాకు వదలాల్సిన ట్రైలర్ కోసం అప్పుడే పనులు జరుగుతున్నాయి. ఒక టీమ్ ప్రత్యేకంగా దీని మీదే వర్క్ చేస్తోంది.