కొత్త ట్రెండ్… ఓటీటీ ప్లస్ థియేటర్స్ డీల్స్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెర్సస్ థియేటర్స్ అన్నట్లుగా నడుస్తోంది ఇప్పటిదాకా ట్రెండ్. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజయ్యేవి. తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాక కథ మారిపోయింది. ముందు ఓటీటీల్లో సినిమాలు విడుదలవడం మొదలైంది. ఆర్నెల్ల ముందు మొదలైన ఈ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఐతే మొదట్లో నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో సినిమాలు రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ముందుకెళ్లిపోయాయి. అన్ని భాషల్లో కలిపి గత ఆరేడు నెలల్లో 50 దాకా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. ఐతే థియేటర్లు పూర్తి స్థాయిలో మొదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి.

ఐతే భిన్న ధ్రువాల్లా సాగిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, థియేటర్ల యాజమాన్యాలు కూడా కలిసి పని చేసే అవకాశాలు లేకపోలేదని సంకేతాలు అందుతున్నాయి. ఇందుకు జీ స్టూడియోస్ వాళ్లు వేసిన ముందడుగే నిదర్శనం. ఆ సంస్థ సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ముందు వార్తలొచ్చాయి. ప్రిమియర్స్ ఇదిగో అదిగో అన్నారు. కానీ ఇటీవల ఆ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతోనే రిలీజ్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా సొంతం చేసుకుంది. ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేయాలన్నది వాళ్లిష్టమే. బహుశా థియేటర్లలో రిలీజ్ చేసిన కొన్ని రోజులకే.. ఓటీటీలో సినిమాను విడుదల చేసే అవకాశముంది. ఒకేసారి రెండు చోట్లా రిలీజ్ చేసే రోజులు కూడా వస్తే ఆశ్చర్యం లేదేమో.

ఇదే కోవలో శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర’ చిత్రాన్ని కూడా జీ స్టూడియోస్ వాళ్లే సొంతం చేసుకోవడం విశేషం. మున్ముందు ఇలా ఓటీటీ ప్లస్ థియేటర్స్ డీల్స్ మరిన్ని జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)