గత ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ మీదే అందరి కళ్లూ నిలిచాయి. కానీ చివరికి ‘హనుమాన్’ సంక్రాంతి విజేతగా నిలిచింది. మహేష్ సినిమా మీద ఇది రెట్టింపు వసూళ్లు సాధించడం విశేషం. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని రుజువు చేసిన చిత్రమది. ఆ సినిమాతో తేజ సజ్జా స్టార్ హీరో అయిపోయాడు. అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ అతను మాత్రం అన్నింటినీ ఒప్పుకోకుండా ‘మిరాయ్’ చిత్రం మీద ఫోకస్ పెట్టాడు. ముందు ఇదేదో చిన్న సినిమా అనుకున్నారు కానీ.. ‘హనుమాన్’ తర్వాత తేజకు సరైన ఫాలో అప్ అనిపించేలా దీన్ని పీపుల్స్ మీడియా సంస్థ భారీగానే తీర్చిదిద్దింది.
టీజర్ చూసినపుడే ఇది వేరే లెవెల్ సినిమా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మధ్యలో సినిమా ఆలస్యం అవుతుండడం.. కొత్త కంటెంట్ రాకపోవడం.. రిలీజ్ డేట్ మారడం వల్ల ‘మిరాయ్’కి హైప్ కొంచెం తగ్గింది. కానీ ట్రైలర్‌తో మళ్లీ కావాల్సిన హైప్ వచ్చేలాగే ఉంది. పైగా టీం కూడా పెద్ద ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు చేయడానికి రెడీ అవుతోంది. ‘హనుమాన్’ కేవలం కంటెంట్‌తోనే ఆడింది. కానీ ‘మిరాయ్’లో కంటెంట్ బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో మారిన తేజ ఇమేజ్ ప్లస్ అవుతోంది.
మంచు మనోజ్ విలన్ పాత్ర చేయడం దీనికి మరింత ఆకర్షణ చేకూరుస్తోంది. కాబట్టి ‘మిరాయ్’ని ఎంతమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీనికి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ నంబర్లు ఆశ్చర్యపరిచేలా ఉండొచ్చు. సెప్టెంబరు 12న రావాలనుకున్న మిగతా చిత్రాలు దీన్ని చూసి కచ్చితంగా భయపడాాల్సిందే. ఆ రోజుకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘కిష్కింధపురి’, దుల్కర్ సల్మాన్ చిత్రం ‘కాంత’ కూడా షెడ్యూల్ అయ్యాయి. కానీ బజ్ పరంగా అవి ‘మిరాయ్’తో పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పోటీలో రావడం కంటే వేరే డేట్ చూసుకోవడం మంచిదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates