ద‌ర్శ‌కుడిగా జ‌యం ర‌వి

తెలుగువాడైన ఎడిట‌ర్ మోహ‌న్.. త‌ర్వాతి ద‌శ‌లో సినీ నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో అనేక చిత్రాలు నిర్మించారు. ఆయ‌న కొడుకులిద్ద‌రూ కూడా ప్ర‌తిభావంతులే. పెద్ద‌బ్బాయి మోహ‌న్ రాజా హ‌నుమాన్ జంక్ష‌న్ స‌హా అనేక రీమేక్ చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాడు. త‌ర్వాత సొంత క‌థ‌తో త‌నీ ఒరువ‌న్ తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఈ సినిమానే కాక‌.. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేసిన ప‌లు చిత్రాల్లో హీరోగా న‌టించి పెద్ద హిట్లు కొట్టాడు ర‌వి. 

త‌న తొలి చిత్రం జ‌యం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న అత‌ను.. పొన్నియ‌న్ సెల్వ‌న్ స‌హా అనేక భారీ చిత్రాల్లోనూ న‌టించి మెప్పించాడు. ఇప్పుడ‌త‌ను ఒకేసారి నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్య జ‌యం ర‌వి నుంచి ర‌వి మోహ‌న్‌గా త‌న పేరును మార్చుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. ర‌విమోహ‌న్ స్టూడియోస్ పేరుతో కొత్త బేనర్ పెట్టాడు.

చెన్నైలో ర‌విమోహ‌న్ స్టూడియోస్ లాంచ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. అనేక మంది ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. త‌న బేన‌ర్లో ర‌వి మోహ‌న్ ఒకేసారి రెండు సినిమాల‌ను అనౌన్స్ చేశాడు. అందులో ఒక‌దాంట్లో ర‌వి, ఎస్.జె.సూర్య ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. కార్తీక్ యోగి అనే యువ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. ఇంకో ప్రాజెక్టు చాలా స్పెష‌ల్. దాన్ని డైరెక్ట్ చేయ‌బోయేది ర‌వి మోహ‌నే కావ‌డం విశేషం. 

ఈ సినిమాతోనే ర‌వి తొలిసారి మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు. ఈ చిత్రంలో క‌మెడియ‌న్ యోగిబాబు హీరోగా న‌టించ‌నుండ‌డం హైలైట్. యోగితో ర‌వికి మంచి అనుబంధం ఉంది. ర‌వి హీరోగా చేసిన ప‌లు చిత్రాల్లో అత‌ను కామెడీ రోల్స్ చేశాడు. ఇప్పుడు ర‌వి సొంత బేన‌ర్లో అత‌నే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న సినిమాలో యోగిబాబు హీరోగా న‌టించ‌డం ప్ర‌త్యేక‌మే. ర‌వి గ‌త ఏడాది త‌న భార్య ఆర్తి నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అత‌ను కెనీషా అనే సింగ‌ర్‌తో ప్ర‌స్తుతం రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడు.