టాలీవుడ్ సెప్టెంబర్ చాలా టఫ్ గురూ

ఆగస్ట్ నెల రవితేజ మాస్ జాతరతో ముగుస్తుందేమోనని చూస్తే అది కాస్తా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మీదకు వెళ్తోంది. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలే వరసగా క్యూ కట్టడంతో థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందనే నమ్మకంతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ముందైతే సెప్టెంబర్ 4 ‘ఘాటీ’ వచ్చేస్తుంది. ఇందులో డౌట్ లేదు. మరుసటి రోజు ‘మాస్ జాతర’ని రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాల గురించి నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట. ఒకవేళ కుదరని పక్షంలో సెప్టెంబర్ 12కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే డేట్ కి తేజ సజ్జ ‘మిరాయ్’ని దింపాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేసుకుంటోంది.

వీళ్లందరి కన్నా ముందుగా సెప్టెంబర్ 12 లాక్ చేసుకుంది బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ‘కిష్కిందపురి’ కోసం కొద్దిరోజుల క్రితమే టీజర్ తో పాటుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మిరాయ్, మాస్ జాతర వచ్చే పక్షంలో థియేటర్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. పోనీ సెప్టెంబర్ 25 వద్దామా అంటే అక్కడ డైనోసర్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’తో తలపడే సాహసం ఎవరూ చేయలేరు. హరిహర వీరమల్లు పోయినా ఓజి మీద హైప్ ఇంచు కూడా తగ్గలేదు. అందుకే పంపిణీదారులు కనివిని ఎరుగని రేట్లను నిర్మాత దానయ్యకు ఆఫర్ చేస్తున్నారు. అఖండ 2 దాదాపు తప్పుకుందని ఫిలిం నగర్ టాక్.

ఇవి కాకుండా పైన చెప్పిన వాటిలో మార్పులు చేర్పులతో సంబంధం లేకండా తమిళ డబ్బింగులు శివ కార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5, విజయ్ ఆంటోనీ భద్రకాళి సెప్టెంబర్ 12 దిగిపోతాయి. అంతే ఓ మొత్తం సినారియో చూసుకుంటే కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో అయిదు పెద్ద టాలీవుడ్ సినిమాలు ( ఘాటీ – మిరాయ్ – మాస్ జాతర – కిష్కిందపురి – ఓజి ) వచ్చేస్తాయి. అదనంగా రెండు అనువాద చిత్రాలు దిగుతాయి. క్యాస్టింగ్, బడ్జెట్ పరంగా అన్నీ ఆయా హీరో హీరోయిన్ల కెరీర్ లో చాలా పెద్దవి. మరి సెప్టెంబర్ లో తాకిడిలా రాబోతున్న కొత్త రిలీజుల్లో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.