ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఏ పెద్ద సినిమా తెరకెక్కుతున్నా సరే, అందులో ఓ బలమైన క్యారెక్టర్ రోల్ చేయాలంటే గుర్తుకు వచ్చే పేరు.. సత్యరాజ్. ఆయన ముందు నుంచే బహు భాషల్లో నటిస్తూ వచ్చినప్పటికీ.. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో తెచ్చుకున్న గుర్తింపే వేరు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత బహు భాషల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు సత్యరాజ్. తాజాగా ‘కూలీ’ చిత్రంలో రాజశేఖర్ అనే పాత్రతో ఆయన ఆకట్టుకున్నారు.
వచ్చే వారం సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన ‘త్రిభాణధారి బార్బరిక్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యరాజ్.. తన పారితోషకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రెమ్యూనరేషన్ విషయంలో ఎన్నోసార్లు రాజీ పడ్డానని.. కానీ ఇప్పుడు మాత్రం తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా బడ్జెట్‌ను బట్టి ఆలోచిస్తానేమో కానీ.. ఒకసారి అనుకున్న పారితోషకంలో మాత్రం తాను తగ్గనని తేల్చి చెప్పారు.
‘‘సినీ రంగానికి వచ్చి 47 ఏళ్లు పూర్తయ్యాయి. కెరీర్ ఆరంభంలో విలన్‌గా 75 సినిమాలు చేశా. ఆ తర్వాత హీరోగా వందకు పైగా సినిమాల్లో నటించా. హీరోగా చేస్తున్నపుడే ఎక్కువగా పారితోషకాలు వదులుకున్నా. కొన్ని సినిమాలు రిలీజ్ చేయడం కోసం అప్పులు కూడా చేశాను. ఐతే ఇప్పుడు నేను క్యారెక్టర్ రోల్సే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకు పారితోషకం విషయంలో వెనక్కి తగ్గాలి. సినిమా మొదలవకముందు మాట్లాడితే రెమ్యూనరేషన్ తక్కువైనా పర్వాలేదు. కానీ సినిమా మొదలయ్యాక అంటే కష్టం. సినిమా బడ్జెట్, నా పాత్ర నిడివిని బట్టి కూడా పారితోషకం ఉంటుంది. బాహుబలి సినిమాకు తీసుకున్నంత బార్బరిక్ మూవీకి తీసుకోను కదా’’ అని సత్యరాజ్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates