స్పిరిట్ హీరోయిన్ ‘దఢక్’ ఎలా ఉంది

Triptii Dimri

యానిమల్ లో మెయిన్ లీడ్ కాకపోయినా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సెకండ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. గ్లామర్ షోతో పాటు పెర్ఫార్మన్స్ కూడా చేసి ఆడియన్స్ ని మెప్పించింది. కాకపోతే ఆ పేరుని నిలబెట్టుకునే స్థాయిలో సరైన సినిమాలు పడలేదు. దర్శకులు ఆఫర్ చేస్తున్న క్యారెక్టర్లు కూడా అలాంటివే కావడంతో జనం మెల్లగా మర్చిపోయే రిస్కుతో పడింది. అయితే స్పిరిట్ లో దీపికా పదుకునేని వద్దనుకుని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకే ఓటేయడంతో మళ్ళీ ఒక్కసారిగా త్రిప్తి డిమ్రి హాట్ టాపిక్ అయిపోయింది. డార్లింగ్ సరసన మెయిన్ హీరోయిన్ అంటే అంతకన్నా క్రేజీ ఆఫర్ ఇంకేముంటుంది.

త్రిప్తి డిమ్రి కొత్త మూవీ దఢక్ 2 నిన్న రిలీజయ్యింది, జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ టైటిల్ ని వాడుకుని దానికి నెంబర్ టూ జోడించి తీశారు. ఇది 2018లో వచ్చిన తమిళ కల్ట్ క్లాసిక్ ‘పరియేరుమ్ పెరుమాళ్’ రీమేక్. పాయింట్ దాన్నే తీసుకుని బ్యాక్ డ్రాప్, సెటప్ మార్చి ప్రేక్షకుల మీదకు వదిలారు. లా కాలేజీలో చేరిన వెనుకబడిన కులానికి చెందిన అబ్బాయి, ధనవంతురాలైన ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇది తెలిసిన పెద్దలు ఆ కుర్రాడి మీద దాడులు చేసి అవి పని చేయక, ఏకంగా చంపాలని చూస్తారు. చివరికి ఈ ప్రేమ జంట ప్రయాణం ఎక్కడికి చేరుకుంది, చివరికి కలిశారా లేదా అనేది అసలు కథ.

ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ దఢక్ 2లో పూర్తిగా మిస్సయ్యింది. లా కాలేజీలో వర్ణ వివక్ష మీద పెట్టిన సీన్లు కొంచెం అతిగా అనిపిస్తే సిద్దాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి మధ్య లవ్ ట్రాక్, పాటలు అవసరానికి మించిన నిడివితో సహనాన్ని పరీక్షిస్తాయి. దర్శకురాలు షాజియా ఇక్బాల్ రైటింగ్, టేకింగ్ రెండూ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. పెర్ఫార్మన్స్ పరంగా త్రిప్తి డిమ్రి ఆకట్టుకోగా అసలు కంటెంట్ వీక్ గా ఉండటంతో ఒకదశ దాటాక డ్రామా ఎక్కువైపోయి ఆమె సైతం చేతులు ఎత్తేసింది. పెరియేరుమ్ పెరుమాళ్ చూసినవాళ్ళు దఢక్ 2 చూడకపోవడం మంచిది. దాన్ని చూడనివాళ్ళు ఇది ట్రై చేయకపోవడం ఇంకా మంచిది.