షాకింగ్.. నటిపై తండ్రి ఫిర్యాదు

ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో గుర్తింపు సంపాదించిన కల్పిక గణేష్.. ఈ మధ్య తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తమిళ నటి ధన్య బాలకృష్ణన్‌తో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన ఆమె.. ఇటీవల ఓ పబ్బులో, తర్వాత కొన్ని రోజులకు ఒక రిసార్ట్‌లో సిబ్బందితో గొడవకు దిగడం ద్వారా సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ రెండు సందర్భాల్లో కల్పిక తన వెర్షన్ చెప్పినా సరే.. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. తరచుగా ఎందుకు ఇలా గొడవలకు దిగడం.. ఎప్పుడూ ఇదే పనా అంటూ ఆమె మీద మండిపడ్డారు.

ముఖ్యంగా తాజా రిసార్ట్ గొడవ గురించి కల్పిక వివరణ ఇస్తూ.. తన గదిలో మరిచిపోయిన సిగరెట్ ప్యాకెట్ తెచ్చి ఇవ్వనందుకు గొడవ పడ్డట్లు చెప్పడంతో ఆమెపై తీవ్ర విమర్శలు తప్పలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ల్పిక తండ్రి సంఘవార్ గణేష్ తన కూతురి మీదే పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కల్పికకు మానసిక సమస్యలు ఉన్నాయని.. ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపేందుకు చర్యలు తీసుకోవాలని తన కంప్లైంట్లో ఆయన పేర్కొన్నారు.

తన కూతురికి ఉన్న మెంటల్ డిజార్డర్ వల్ల కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని.. ఇప్పటికే ఆమె రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని గణేష్ పేర్కొనడం గమనార్హం. గతంలో ఆమెను కొంత కాలం పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌కు సైతం పంపించినట్లు ఆయన వెల్లడించారు. ఐతే రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో కల్పిక డిప్రెషన్‌లో ఉందని.. తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోందని.. తన కూతురిని తిరిగి మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని గణేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కల్పిక అనుచిత ప్రవర్తనకు ఇదా కారణం అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.