మోహన్ బాబుపై ఆరేళ్ల కేసు కొట్టివేత

టాలీవుడ్ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుల మీద ఆరేళ్ల కిందట నమోదైన కేసులో వారికి ఊరట లభించింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కోసం ధర్నా చేసినందుకు వారిపై నమోదైన కేసును కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా.. 2019 మార్చి 22న తమ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు తిరుపతిలో రోడ్డుపై ర్యాలీ చేయడం, బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ ర్యాలీ, ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని.. ప్రజలకు ఇబ్బంది తలెత్తిందని మోహన్ బాబు, విష్ణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ వారిపై అభియోగాలు మోపారు. తర్వాత ఆ ఎన్నికల్లో మోహన్ బాబు, విష్ణు మద్దతుగా నిలిచిన వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు ముందుకు కదల్లేదు. ఐతే పెండింగ్‌లో ఉన్న ఆ కేసు ప్రభుత్వం మారాక మళ్లీ వేగం అందుకుంది. తమపై పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని.. ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా తమపై కేసు పెట్టినందున దీన్ని కొట్టి వేయాలని మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. 

ఐతే వీరి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో వీళ్లిద్దరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నాక సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2019 మార్చి 23న చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌‌ను కొట్టి వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్‌లను కలిపి చదివిన తర్వాత అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్థం కాలేదని.. వాళ్లిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కానీ, ప్రజలకు హాని తలపెట్టినట్లు కానీ ఆధారాలు చూపలేకపోయారని సుప్రీం కోర్టు పేర్కొంది.