సినిమాలు మానేశాక ఏం చేస్తారు అని అడిగితే.. ఏదైనా బిజినెస్ చేస్తాం అంటారు నటులు. కానీ మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ రూటే వేరు. అతను క్యాబ్ డ్రైవర్‌గా మారతానని అంటున్నాడు. ఈ మాట అతను చెప్పడం తొలిసారి కాదు. గతంలోనూ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పి ఆశ్చర్యపరిచాడు. అతను సరదాగా ఈ మాట అంటున్నాడేమో అనుకుంటే.. అదేమీ కాదని, ఆ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడని అర్థమవుతోంది. తాను రిటైరయ్యాక క్యాబ్ డ్రైవర్‌గా మారతానని ఫాహద్ మరోసారి నొక్కి వక్కాణించాడు.
ఐతే అతను డ్రైవర్ అయ్యేది ఇండియాలో కాదట. స్పెయిన్‌లోని బార్సిలోనానట. ప్రపంచంలో తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదేనని.. అక్కడ క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాలనుకుంటున్నానని ఫాహద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక చాల్లే చూడలేకపోతున్నాం.. అని ప్రేక్షకులు తన విషయంలో అనుకున్న రోజు తాను నటన మానేస్తానని ఫాహద్ తెలిపాడు. తాను పలుమార్లు బార్సిలోనా వెళ్లానని.. కొన్ని నెలల ముందు కూడా భార్యతో కలిసి ఆ నగరాన్ని సందర్శించానని ఫాహద్ వెల్లడించాడు.
ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశమైన బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా పని చేయాలన్నది తన కోరిక అని అతను చెప్పాడు. ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చడాన్ని మించిన ఆనందం ఏముంటుందని అతను చెప్పాడు. అందుకే రిటైరయ్యాక బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా మారి అక్కడే కాలం గడుపుతానని ఫాహద్ వెల్లడించాడు. డ్రైవింగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎప్పుడూ బోర్ కొట్టని పని అదని ఫాహద్ చెప్పాడు. ఫాహద్ తమిళంలో వడివేలుతో కలిసి నటించిన ‘మారీశన్’ ఈ వీకెండ్లో రిలీజై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates