పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల కోసం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. రేపే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా రిలీజవుతుందా లేదా అనే సస్పెన్స్ నడిచింది. ఐతే రిలీజ్‌కు ఒక్క రోజు ముందు కూడా టెన్షన్ తప్పలేదు. అటు యుఎస్‌లో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్ షోలకు సంబంధించినదే ఈ టెన్షన్ అంతా. ఇండియాలో అర్ధరాత్రి సమయానికి యుఎస్‌లో ప్రిమియర్స్ మొదలు కావాలి. ఐతే అక్కడికి పూర్తి కంటెంట్ వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ముందు ఫస్టాఫ్ కంటెంట్ పంపించారు. సెకండాఫ్ సీజీ వర్క్ జరుగుతుండడంతో డిస్క్‌లు పంపడం ఆలస్యం అయింది.
భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నానికి సెకండాఫ్ కంటెంట్ చేరింది. దీంతో సమయానికి కంటెంట్ వస్తుందో లేదో.. ప్రిమియర్స్ పడతాయో లేదో అని టెన్షన్ పడ్డ డిస్ట్రిబ్యూటర్ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్స్ విషయంలోనూ ఇదే రకమైన టెన్షన్ నడిచింది. ఏపీలో రాత్రి 9-9.30 షోలకు బుకింగ్స్ ముందు నుంచే నడుస్తున్నాయి. టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. కానీ కంటెంట్ డెలివర్ అవుతుందా లేదా అన్న భయాలు వెంటాడాయి. తెలంగాణలో కూడా ప్రిమియర్స్‌కు అనుమతులు లభించినా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా ఎక్కడా ఒక్క షోకూ బుకింగ్స్ మొదలు కాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ తప్పలేదు.
థియేటర్లన్నీ 9.30 షో కోసం స్లాట్ వదులుకుని కూర్చున్నాయి. కానీ బుకింగ్స్ మాత్రం మొదలుపెట్టట్లేదు. మరి సమయానికి కంటెంట్ రాదన్న అనుమానమా.. లేక ఈ షోలకు బుకింగ్స్ ఓపెన్ చేస్తే తొలి రోజు షోలను జనం పట్టించుకోరన్న భయమా అన్నది తెలియలేదు. తొలి రోజు మెజారిటీ టికెట్లు అమ్ముడయ్యాక ప్రిమియర్ షోలకు సాయంత్రం బుకింగ్స్ మొదలుపెడదాం అనుకున్నారేమో తెలియదు. ఒక దశలో ఈ రోజు ప్రిమియర్స్ ఉండవేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ మధ్యాహ్నం మూడున్నర నుంచి నెమ్మదిగా షోలు ఓపెన్ అయ్యాయి. 9.30 షోలు యాడ్ అవుతూ వెళ్లాయి. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోయాయి. కంటెంట్ కూడా డెలివర్ అవుతుండడంతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో బుధవారం సెకండ్ షో నుంచే ‘హరిహర వీరమల్లు’ సందడి చేయబోతున్నాడని స్పష్టమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates