కోట పాత్రలన్నీ ఒకెత్తు.. అదొక్కటి మరో ఎత్తు

పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వ్యక్తులు చనిపోయాక కూడా ప్రజల జ్ఞాపకాల్లో బతికే ఉంటారు. సినీ రంగంలో అలాంటి బలమైన ముద్ర వేసిన నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. కోట బిజీ ఆర్టిస్టుగా ఉన్నపుడు తెలుగు సినిమా పరిధి చిన్నది కావడం వల్ల ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కి ఉండకపోవచ్చు. ఆయనకు ఆస్కార్ అవార్డు రాకపోయి ఉండొచ్చు.

కానీ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఆయనొకడు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణగా నిలిచే పాత్రలో ఆయన కెరీర్లో కోకొల్లలు. ఒక సినిమాలో కర్కోటకుడైన విలన్ పాత్రతో మెప్పించి.. అదే సమయంలో రిలీజైన మరో చిత్రంతో కడుపుబ్బ నవ్వించడం.. మరో చిత్రంతో కన్నీళ్లు పెట్టించడం కోటకే చెల్లు. కోట కెరీర్లో ఏది బెస్ట్ రోల్.. ఏ రసాన్ని ఆయన బాగా పండించారు అని చెప్పాలంటే చాలా కష్టం. నటనలో నవ రసాలుంటే.. ప్రతి రసాన్ని పండించి మెప్పించిన అరుదైన నటుల్లో ఒకరిగా ఆయన్ని చెప్పొచ్చు.

ఐతే ‘ది బెస్ట్’ అంటూ ఒక పాత్రను ఎంచి చెప్పడం కష్టమే కానీ.. ఆయన కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్‌గా ‘గణేష్’ చిత్రంలో చేసిన హెల్త్ మినిస్టర్‌‌ పాత్రను చెప్పొచ్చు. కోట బేసిగ్గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ ఇందులో తెలంగాణ యాసతో సాగే పాత్రను పోషించిన విధానానికి ఇక్కడి వాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఆహార్యం, భాష, యాస, స్క్రీన్ ప్రెజెన్స్, నటన.. ఇలా ప్రతి విషయంలోనూ నూటికి నూరు మార్కులు పడతాయి ఈ పాత్ర విషయంలో.

ఒక కిరాతకుడైన రాజకీయ నాయకుడంటే ఇలాగే ఉంటాడు అనిపించేలా.. ఒళ్లు గగుర్పొడిచేలా ఆ పాత్రను ఆయన పోషించారు. వెంకీ ఇంటికి వచ్చి ముందు కాళ్ల బేరానికి వచ్చి, తర్వాత వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో కోట నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అవుతుంది. ఇక పతాక సన్నివేశాల్లో కోట నటన అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మరెన్నో అద్భుతమైన పాత్రలు చేసినప్పటికీ.. ఈ క్యారెక్టర్ మాత్రం కోట కెరీర్లో అత్యున్నత స్థాయిలో నిలుస్తుందనే చెప్పాలి. ఈ పాత్రకు ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు.