బ్యాక్ బెంచీలను మార్పించిన సినిమా

కేవలం వినోదం కోసమే చూసే సినిమాలు నిజ జీవితానికి స్ఫూర్తి ఇస్తాయా అంటే కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే కనిపిస్తాయి. కర్తవ్యం చూసి పోలీస్ కావాలనుకున్న ఆడపిల్లలు అప్పట్లో ఎందరో ఉండేవారు. శంకరాభరణం చూసి సంగీతం, సాగర సంగమం చూసి డాన్స్ నేర్చుకున్న పిల్లల గురించి ఇప్పటి పెద్దలను అడిగితే కథలుగా చెబుతారు. అలాని ఠాగూర్, అపరిచితుడు చూసి గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు ఇచ్చే వ్యవస్థ పోలేదు. భారతీయుడు చూసి అవినీతి అధికారుల్లో మార్పు రాలేదు. ఇక ఇప్పటి ట్రెండ్ గురించి చెప్పనక్కర్లేదు. వెబ్ సిరీస్ లు చూసి హత్యలు చేస్తున్న ఉదంతాలు రోజూ చూస్తున్నాం.

కానీ ఒక మలయాళీ సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్ల ముఖ చిత్రాన్ని మారుస్తోంది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన ‘స్థానర్ధి శ్రీకుట్టన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వినేష్ విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కథ మొత్తం స్కూల్ పిల్లల చుట్టూ తిరుగుతుంది. శ్రీకుట్టన్ అనే ఏడో తరగతి కుర్రాడు బ్యాక్ బెంచర్. చదువులో వెనుకబడి ఎప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ ని వేసుకుని అల్లరి చేస్తూ ఉంటాడు. పక్క తరగతి వాళ్ళతో గొడవ, ఇష్టపడిన క్లాస్ మేట్, అందరూ తిట్టుకునే ఒక మాస్టర్ ఇలా వీళ్లందరి మధ్య ఊహించని ఒక సమస్య వస్తుంది. అదేంటి, ఎలా తీర్చుకున్నారనే పాయింట్ తో స్థానర్ధి శ్రీకుట్టన్ రూపొందింది.

సింపుల్ గా అనిపించే లైన్ తో దర్శకుడు చాలా మంచి ఎమోషన్లను చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది ఎంతగా ప్రభావితం చేసిందంటే కేరళలో ఇప్పుడు చాలా స్కూల్స్ లో బ్యాక్ బెంచీలు లేవు. అందరూ సమానమేననే సందేశం చాటేలా యు షేప్ లో బెంచీలు వేయించి ఒకరికొకరు సులభంగా కనిపించేలా మార్పు చేయించారు. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చి పిల్లల మధ్య భేదాలు తగ్గిస్తోందట. అంతే కాదు పంతుళ్ళకు మరింత శ్రద్ధ పాఠాలు చెప్పే బాధ్యత పెరిగిందట. బాగుంది కదూ. ఇదేదో అన్ని చోట్లా అమలు చేస్తే ఈ బ్యాక్ బెంచీల గోల తగ్గిపోయి అందరు పిల్లలు ఒకేలా చదువుకుంటారేమో.