ఇండియ‌న్-2 నుంచి ఆయ‌న‌లా త‌ప్పించుకున్నాడు

ఇండియ‌న్.. సౌత్ ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టే కాదు.. అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లోనూ ఒక‌టి. ఆ సినిమాను నిర్మించింది తెలుగు నిర్మాత అయిన ఏఎం ర‌త్నం. కానీ ఇండియ‌న్ సీక్వెల్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ప్రొడ్యూస‌ర్ మారిపోయాడు. నిజానికి ఏఎం ర‌త్న‌మే ఈ సినిమాను కూడా చేయాల్సింద‌ట‌. ఆయ‌న కూడా అందుకు ఆస‌క్తిగానే ఉన్నార‌ట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కు వెళ్లిపోయింద‌ని ర‌త్నం ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఇండియ‌న్ సినిమా నిర్మాతే త‌నే కాబ‌ట్టి.. సీక్వెల్ తీసే హ‌క్కు త‌న‌కే ఉంద‌ని, ఆ సినిమాను వేరే సంస్థ ప్రొడ్యూస్ చేసినందుకు త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం కూడా ద‌క్కింద‌ని ర‌త్నం చెప్ప‌డం విశేషం.

త‌న ప్రొడ‌క్ష‌న్లో శంక‌ర్ తీసిన ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర సృష్టించింద‌ని.. సోష‌ల్ ఇష్యూస్‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా చెప్ప‌డం ఈ సినిమాతోనే మొద‌లైంద‌ని ర‌త్నం చెప్పారు. ఇప్పుడు రాజ‌మౌళి నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడ‌ని.. కానీ ఒక‌ప్పుడు శంక‌ర్‌ను మించిన ద‌ర్శ‌కుడు లేడ‌ని.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లాడ‌ని ర‌త్నం కొనియాడారు. శంక‌ర్ క‌మిట్మెంట్ చాలా గొప్ప‌ద‌ని.. సినిమా చేస్తున్న స‌మయంలో ప్ర‌తి విష‌యం ద‌గ్గ‌రుండి చూసుకునేవాడ‌ని.. ఒక య‌జ్ఞంలా సినిమా తీసేవాడ‌ని.. ఆ టైంలో ఫ్యామిలీ ఫంక్ష‌న్లు స‌హా వేటికీ వెళ్లేవాడు కాద‌ని ర‌త్నం చెప్పారు.

ఇండియ‌న్-2 తీయాల‌ని శంక‌ర్ అనుకున్న‌పుడు త‌న‌తో మాట్లాడాడ‌ని.. త‌నే ప్రొడ్యూస్ చేద్దామ‌ని అనుకున్నాన‌ని.. కానీ లైకా సంస్థ‌కు మరో సినిమా చేయాల్సిన క‌మిట్మెంట్ ఉండ‌డంతో ఆ చిత్రం వాళ్ల‌కు వెళ్లింద‌ని ర‌త్నం చెప్పారు. ఐతే త‌మిళంలో వాళ్లే తీసుకున్నా.. తెలుగు వ‌ర‌కు తాను ప్రొడ్యూస‌ర్‌గా ఉంటాన‌ని చెప్పాన‌ని.. కానీ త‌ర్వాత ఆ వెర్ష‌న్ కూడా వాళ్లే టేక‌ప్ చేసి ఇండియ‌న్ ఒరిజిన‌ల్ నిర్మాత అయిన త‌న‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌డానికి అంగీక‌రించార‌ని ర‌త్నం తెలిపారు. లైకా సంస్థ ప్ర‌తినిధి కూడా త‌న ఫ్రెండే అని.. త‌న ద్వారానే శంక‌ర్‌తో అత‌డికి ప‌రిచ‌యం జ‌రిగి ఆయ‌నతో 2.0, ఇండియ‌న్-2 సినిమాలు తీశార‌ని ర‌త్నం తెలిపారు.