కొన్ని హాలీవుడ్ ఫ్రాంచైజీలకు క్రేజ్ చాలా ఎక్కువ. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఐరన్ మ్యాన్, మమ్మీ లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటికి ఎన్ని కొనసాగింపులు వచ్చినా సరే జనాలు ఎగబడి చూస్తారు. అలాని ప్రతి భాగంలో కొత్త కథేమీ ఉండదు. జస్ట్ ముందు వచ్చిన వాటికి కొన్ని మార్పులు చేసి, యాక్షన్ ఎపిసోడ్లు భారీగా పెట్టి పని కానిచ్చేస్తారు. అదనంగా 3డి, ఐమాక్స్, ఐస్ అంటూ ప్రత్యేకంగా వెర్షన్లు రిలీజ్ చేయడం ద్వారా ఎక్కువ శాతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు. ప్రస్తుతం జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ఇదే పనిలో ఉంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొన్న జూలై 4 రిలీజైన సంగతి తెలిసిందే.
నాలుగు రోజులకు గాను ఇండియాలో సుమారు 45 కోట్ల దాకా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇది చాలా పెద్ద మొత్తం. నిన్న సోమవారం వర్కింగ్ డే నాడు వేరే ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో డీసెంట్ నెంబర్లు దీనికే నమోదయ్యాయి. సండేతో పోలిస్తే డెబ్భై శాతం దాకా డ్రాప్ ఉన్నప్పటికీ అనుకున్న దానికన్నా జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ఎక్కువ పే చేస్తోంది. మొదటి మూడు రోజులు హంగామా చేసిన కన్నప్ప, ఇటీవలే విడుదలైన తమ్ముడు కూడా రాకాసి బల్లుల కన్నా చాలా తక్కువ వసూలు చేయడం గమనార్షం. బ్రాడ్ పిట్ ఎఫ్1 కన్నా జురాసిక్ రీ బర్త్ కే ఎక్కువ ఆదరణ దక్కుతున్న వైనం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
నిజానికి జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మీద పెద్దగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. చూసిందే మళ్ళీ చూపించారనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయినా ఆడియన్స్ ఒక్కసారి చూడాలని డిసైడైపోయారు. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా 322 మిలియన్ డాలర్లు వసూలు చేసిందట. అంటే మన కరెన్సీలో 2765 కోట్లు. అందరూ ఆహా ఓహో అని మెచ్చుకున్నా ఎఫ్1 వసూలు చేసింది కేవలం 293 మిలియన్ డాలర్లు (2515 కోట్లు). దీన్ని బట్టే రాకాసి బల్లులు జనాన్ని ఎంతగా థియేటర్లకు రప్పించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వారం సూపర్ మ్యాన్ వస్తున్నాడు కాబట్టి డైనోసార్ల దూకుడుకు బ్రేక్ పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates