అంచనాలను తలక్రిందులు చేసాడు

శివ సినిమాకి ఆర్టిస్ట్స్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి మద్రాస్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్ లో.. నేను పక్క సీట్ లో.. Rgv ఎదురుగా వున్న సీట్లో కూర్చుని ఉంటే వేషం కోసం వచ్చిన వ్యక్తి రూమ్ తలుపు తీసుకుని లోపలకు వచ్చిన వ్యక్తిని రాము ఎదురుగా వున్న సీట్ లో కూర్చోమనేవాళ్ళం.. ఇప్పుడావచ్చిన వ్యక్తికి రాము వివరంగా చెప్పేవాడు తనకి ఎలాంటి నటన కావాలో.. అత్యంత నాటకీయత వద్దు.. పెద్దపెద్దగా ఏడుస్తూ డైలాగులు చెప్పొద్దూ.. పౌరాణికాలు పెద్దపెద్ద సమాసాలతో కూడిన డైలాగ్స్ వద్దు అని చెప్పేవాడు..

ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ముందు వచ్చిన నలుగురిలో ఇద్దరు ఇలాంటి డైలాగ్స్ వినిపించారు… వెంటనే అతనిని పంపి తరువాత వ్యక్తిని ప్రవేశపెట్టేవాళ్ళం.. అందరికి సేమ్ డైలాగ్ చెప్పేవాడు రాము.. ఒకడు అంతా విని చేస్తాను సార్ అని పైకి లేచి మాకు ఎదురుగా మూసివున్న డోర్ వైపు తిరిగి 2 నిమిషాల తర్వాత మా వైపు తిరిగితే అతని కళ్ళు ఎర్రగా మారి ఉండేవి.. ఇప్ప్పుడు పెద్దపెద్దగా డైలాగ్స్ చెబుతూ మావైపుకు నడుస్తూ వచ్చేవాడు.. రాము కంగారుపడి ఆపండి ఆపండి అని గట్టిగా చెప్పి అతను శాంతించాక బైటకు పంపాక రాము కి ఒక డౌట్ వచ్చింది.. నాగేశ్వరావ్ నేను వాళ్లకు కరక్ట్ గా క్లియర్ గా చెబుతున్నా వాళ్లకు ఎందుకు అర్ధం కావడం లేదు అని అడిగాడు..

అప్పుడు నేను చెప్పాను.. మీరు చెప్పేది కరక్టే.. వాళ్ళు వింటున్నారు అని మీరు అనుకుంటున్నది కరక్టే.. మరి ఎందుకు ఇలా అనేవాడు రాము… మీరు చెబుతున్నప్పుడు అతను మనసులో రిహార్సల్స్ చేసుకుంటున్నాడు.. నర్సరావుపేట లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన డైలాగ్ చెబుదామా తెనాలి లో సన్మానం చేసినప్పుడు చెప్పిన డైలాగ్ చెబుదామా అని ఆలోచిస్తున్నాడు.. మీరు చెప్పేది వింటున్నట్టు నటిస్తున్నాడు.. లేచి అతను చేద్దామనుకున్నది చేస్తున్నాడు.. మే బి యు అర్ రైట్ అనేవాడు.. తరవాత పొడవుగా వున్న ఒక కుర్రవాడు వచ్చాడు.. రాము సేమ్ డైలాగ్.. అతను పైకి లేచాడు.. రాము కంగారు పడుతున్నాడు… లేచిన వ్యక్తి వెళ్లి డోర్ వద్ద కూర్చున్నాడు.. మేము ఇద్దరం ఆశ్చర్యంగా చూస్తున్నాం.. అప్పుడు అతను చెరువు గట్టున కూర్చున్నట్టు.. ఎదురుగా వున్న తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఒక్కొక్క రాయి తీసి చెరువులో విసురుతున్నట్టు మూడు డైలాగ్స్ చెప్పి లేచి నిలబడ్డాడు.. ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అని అతను వెళ్ళాక తలుపు వేసాను.. ఇతను చాలా నేచురల్ గా చేసాడు.. ఇతని పేరు నోట్ చేసుకోండి అని రాము చేప్పాడు..

రాము ఇతను ఫిలిం ఇంస్టిట్యూట్ స్టూడెంట్.. వీళ్ళకి ఇలాంటివి నాలుగు నేర్పి పంపిస్తారు వాళ్ళు.. ఇప్పుడు ఇతనితో యాక్ట్ చేయఁచాలంటే మనం ఒక చెరువు గట్టు సెట్ వేసి ఒక డబ్బా గులకరాళ్లు ఇస్తే రాళ్లు దానిలో వేస్తూ యాక్టింగ్ చేస్తాడు అన్నాను.. రాము కాదని అతనిని సెలక్ట్ చేసాడు.. ఫస్ట్ డే షూట్ అయ్యాక అతనికి నేనే చెప్పాను.. నేను వద్దన్నా వినకుండా రాము నిన్ను ఓకే చేశారు.. బాగా చేస్తున్నావ్.. నా అంచనాల్ని తలక్రిందులు చేసావ్… కంగ్రాట్యులేషన్స్.. అని.. ఆ కుర్రాడే జితేంద్ర.. శివ సినిమా లో అతను వేసిన వేషం చిన్నా..ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్లైట్ టాపిక్ వచ్చి నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదండీ అన్నాడు.. ఈ సినిమా పూర్తి అయ్యే లోపు నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తా అని చాలా క్యాజువల్ గా చెప్పాను..

తరవాత షెడ్యూల్ లో చిన్నాతో చేయాల్సిన వర్క్ నైట్ ఎఫెక్ట్ లో ప్లాన్ చేసాను.. చిన్నా తరువాత రోజు మద్రాసు లో బయలుదేరి ఎల్లుండి పొద్దున్న హైదరాబాద్ లో దిగుతాడు.అదే రోజు నైట్ షూట్…. కానీ రాము ఆ సీన్ ఆరోజు రాత్రే తీద్దామనుకున్నాడు.. నన్ను అడిగితె ఎల్లుండి నైట్ ప్లాన్ చేశాను కదా మళ్ళీ డిస్ట్రబ్ చెయ్యడం ఎందుకు అన్నాను.. ఈ రోజు తీస్తే మీ ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు.. అతను ఈవినింగ్ ఫ్లైట్ లో రావాల్సివుంటుంది.. ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుండి డైరక్ట్ గా లొకేషన్ కి వచ్చినాకూడా రాత్రి 8అవుతుంది అని చెప్పాను.. పర్వాలేదు పిలిపించండి అన్నాడు రాము..

విధి లేక మద్రాస్ ఫోన్ చేసి ఈవినింగ్ ఫ్లయిట్ కి చిన్నాని ఎక్కించామన్నాను.. ఎయిర్ పోర్ట్ నుండి లొకేషన్ కి వచ్చి హడావిడిగా నన్ను వెతుక్కుంటూ నాదగ్గరకు వచ్చి నాగేశ్వరావు గారు నా బోర్డింగ్ పాస్ మీద మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని బోర్డింగ్ పాస్ నాకిచ్చాడు.. అతని ముఖం వెలిగిపోతుంది.. ఆటోగ్రాఫ్ ఇచ్చాను.. ఇప్పటికే ఆ బోర్డింగ్ పాస్ అతని దగ్గర భద్రంగా వుంది.. తరవాత చిన్నా అనే తన క్యారక్టర్ పేరే స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడు..

— శివ నాగేశ్వర రావు