మార్చి గురించి ఏదేదో ఊహించుకుంటే..

పోయినేడాది వేసవి పెద్ద సినిమాలు లేక వెలవెలబోయింది. కానీ ఈసారి సమ్మర్ మాత్రం అలా ఉండదనే సంకేతాలు కనిపించాయి. వేసవి సీజన్ ఆరంభంలోనే బాక్సాఫీస్ బద్దలైపోయే సంకేతాలు కనిపించాయి. ఈ నెల చివరి రెండు వారాలకు భారీ చిత్రాలు షెడ్యూల్ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు. ఐతే ఎన్నో ఆశలు రేకెత్తించిన ఆ సినిమాలు ఒక్కొక్కటిగా మార్చి రేసు నుంచి తప్పుకోవడంతో వేసవి సీజన్ మళ్లీ వెలవెలబోతుందా అన్న భయం పట్టుకుంది సినీ ప్రియులకు.

మార్చి చివరి వారానికి ముందు రేసులో ఉన్న సినిమాలు పెద్ది, ప్యారడైజ్. ఒకే వీకెండ్లో బాక్సాఫీస్ వేటకు సిద్ధమయ్యాయీ సినిమాలు. మార్చి 26న ‘పెద్ది’ రావాల్సి ఉండగా.. 27కు ‘ప్యారడైజ్’ షెడ్యూల్ అయింది. కానీ ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడిపోయాయి. ‘పెద్ది’ని ఏప్రిల్ 30కి షెడ్యూల్ చేశారు కానీ.. ఆ డేటుకైనా సినిమా పక్కాగా వస్తుందా అనే అనుమానాలున్నాయి. ఇక ‘ది ప్యారడైజ్’ పూర్తిగా వేసవి రేసు నుంచి తప్పుకుంది. ఆగస్టుకు వాయిదా పడిపోయింది.

రెండు భారీ చిత్రాలు వెనక్కి వెళ్లిపోవడంతో మార్చి నెల ఫోకస్ ‘టాక్సిక్’ మీదికి మళ్లింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న వస్తుందా రాదా అనే అనుమానాలు కలిగినప్పటికీ.. టీం పక్కాగా అదే డేటుకు రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో యుద్ధం నడుస్తుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయడం ఫిలిం లవర్స్‌కు పెద్ద షాకే. ముందు మార్చి 19కే అనుకున్న ‘డెకాయిట్’ సైతం వాయిదా పడింది. దీంతో మార్చి నెల మరింతగా కళ తప్పినట్లయింది.

ఇక దురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్‌ల మీదే ఆశలు నెలకొన్నాయి. ఐతే ‘దురంధర్-2’ కూడా పక్కా వస్తుందో లేదో అన్న డౌట్లు కొడుతున్నాయి. ‘ఉస్తాద్..’ మీద మరీ అంచనాలు లేవు. మరోవైపు వేసవిలో ఇంకా ఏ సినిమాలు రేసులో నిలుస్తాయో.. ఏవి వాయిదా పడతాయో.. మళ్లీ గత ఏడాది లాగే సమ్మర్ సీజన్ నిరాశ పరుస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.