సూర్యతో అట్లూరి.. ఆ బయోపిక్ చేద్దామని వెళ్లి

వెంకీ అట్లూరి.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. నటుడిగా తెలుగు తెరకు పరిచయమై, అందులో సక్సెస్ కాలేక కనుమరుగైన వెంకీ.. చాలా గ్యాప్ తర్వాత ‘తొలి ప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్నందుకున్న అతను.. తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దె’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. కానీ వెంకీ తర్వాతి రెండు చిత్రాలు ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. కమర్షియల్‌గానూ మంచి విజయాన్నందుకున్నాయి.

దీంతో వెంకీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఏకంగా తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య.. వెంకీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇటీవలే వీరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయింది. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో సూర్యతో తన సినిమా ఎలా ఓకే అయిందో వివరించాడు వెంకీ. నిజానికి తాను సూర్యతో చేయాలనుకున్నది ఒక బయోపిక్ అని.. కానీ చివరికి ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తున్నానని వెంకీ వెల్లడించాడు.

ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ దేశంలో మారుతి మోటార్స్ మొదలుపెట్టడానికి చేసిన కృషి.. అది దేశంలో విప్లవానికి దారి తీసిన వైనం గురించి సినిమా తీయాలన్నది తన ప్రణాళిక అని వెంకీ తెలిపాడు. ఐతే ఈ కథతో సూర్యను సంప్రదించినపుడు.. అప్పటికే తాను ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా), ‘జై భీమ్’ రూపంలో రెండు బయోపిక్స్ చేశానని.. మళ్లీ ఇంకో బయోపిక్ చేస్తే ఎలా అని సంశయం వ్యక్తం చేశాడని.. దీంతో పాటుగా సంజయ్ గాంధీ మీద సినిమా తీయడానికి అనుమతులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని.. దీంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశానని వెంకీ తెలిపాడు.

ఆ తర్వాత తాను సూర్య కోసం ఒక ప్లెజెంట్ ఫ్యామిలీ డ్రామా రాశానని.. ఈ కథ వినగానే సూర్యకు తెగ నచ్చేసిందని.. ఫస్ట్ నరేషన్ టైంకి తాను క్లైమాక్స్ కూడా చెప్పలేదని.. అయినా సూర్య సినిమా చేయడానికి అంగీకరించారని వెంకీ వెల్లడించాడు. తర్వాత పూర్తి స్క్రిప్టు రెడీ చేశానని.. ఇందులో సూర్య పాత్ర ‘గజిని’లోని సంజయ్ రామస్వామిని పోలి ఉంటుందని వెంకీ తెలిపాడు.