కాంటాలగా హీరోయిన్.. ఇక లేదు

2000 సంవత్సరానికి దశకం చివర్లో బాలీవుడ్ పాప్ సాంగ్స్ భారతీయ ప్రేక్షకులను ఊపేసిన సమయంలో బాగా పాపులర్ అయిన పాటల్లో ‘కాంటాలగా’ ఒకటి. 70వ దశకంలో వచ్చిన ఓ బాలీవుడ్ మూవీలోని పాటను తీసుకుని రీమిక్స్ చేస్తే అప్పటి యువతను ఒక ఊపు ఊపేసిందీ పాట. ఈ పాటతో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన షెఫాలీ జరివాలా ఇప్పుడు హఠాత్తుగా చనిపోవడం షాకింగ్‌గా మారింది. షెఫాలీ వయసు 42 ఏళ్లు మాత్రమే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. 

చిన్న వయసు, పైగా ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగిన షెఫాలీ ఇలా గుండెపోటుతో చనిపోవడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న రాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని తన భర్త పరాగ్ త్యాగికి చెప్పిందట షెఫాలీ. దీంతో ఆమెను ముంబయిలోని అంధేరీలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వచ్చేలోపే షెఫాలీ చనిపోయినట్లు వైద్యలు నిర్ధారించారు.

షెఫాలీ 2002లో ‘కాంటాలగా’ ఫేమ్‌తో తర్వాత మరి కొన్ని పాప్ సాంగ్స్ చేసింది. అలాగే కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. ఆపై బిగ్ బాస్ 13వ సీజన్లో పాల్గొని ఇంకా ఫేమ్ తెచ్చుకుంది. తర్వాత మరి కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2004లోనే ఆమె సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ను పెళ్లాడింది. ఐదేళ్ల తర్వత ఈ జంట విభేదాలు వచ్చి విడిపోయింది.

2015లో ఆమె పరాగ్ త్యాగిని పెళ్లాడింది. ఈ జంట అన్యోన్యంగా జీవిస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా షెఫాలీ గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. రోజూ జిమ్ చేస్తూ, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ షెఫాలీ చిన్న వయసులో గుండెపోటుకు గురి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షెఫాలీ ఉదంతంతో కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల గుండెపోటు వస్తోందనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది.