కుబేరకొచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అయితే రిలీజైన రెండో రోజే హీరోగా ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారనే అవసరం లేని డిస్కషన్ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ కుబేర తాను పోషించిన దీపక్ పాత్ర చుట్టే తిరుగుతుందని, దర్శకుడు శేఖర్ కమ్ముల అలా కన్విన్స్ చేసి ఒప్పించాడని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క వీడియో క్లిప్ తీసుకున్న తమిళ జనాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇది డైరెక్టర్ మూవీ అని నాగ్ చెప్పడాన్ని చూపించి ఇప్పుడు మాట మారుస్తారా, ఇది ధనుష్ సినిమా అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
నిజానికి ఇదే ప్రెస్ మీట్ లో నాగార్జున మరోసారి మాయాబజార్, గుండమ్మ కథలాగా కుబేర ఎవరో ఒకరి సినిమా కాదని అందరిదని, అందులోనూ శేఖర్ కమ్ములకు క్రెడిట్ ఇస్తూ స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప తన వల్లే ఆడిందని, లేదా నేను చేయకపోతే గొప్పగా వచ్చేది కాదని అనలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. కుబేర కమర్షియల్ మూవీ అయితే ఈ డిస్కషన్ కు అర్థం ఉంటుంది. కానీ పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడ్డ కుబేరలో ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేవు. కనీసం హీరో హీరోయిన్ మీద ఒక డ్యూయెట్ లేదు. సబ్జెక్టుని నమ్ముకుని కోట్లు ఖర్చు పెట్టేసి ఇవాళ మంచి ఫలితం అందుకున్నారు.
సో నాగార్జున అన్నట్టు ఇది అందరి సినిమా. దీనికి డిబేట్ లేదు. ప్రాక్టికల్ గా చూస్తే దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ తో విలన్ కు పని పడకపోతే దేవా తిరుపతి వీధుల్లో బిచ్చగాడిగానే ఉండేవాడు. ఆ కోణంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ నాగ్, జిమ్ సర్బ్ కు దక్కుతుంది. కాకపోతే దేవా రూపంలో ధనుష్ కి స్కోప్ దొరకడం వల్ల చెలరేగిపోయాడు. అంతే తప్ప కావాలని ఒకరు హీరో, ఒకరు కాదు అనే చర్చలు టైం వేస్ట్ తప్ప ఇంకే ప్రయోజనం లేదు. ఆర్ఆర్ఆర్ టైంలోనూ తారక్, ఛరన్ఫ్ ఫ్యాన్స్ మధ్య ఆన్ లైన్ వార్ జరగడం చూశాం. ఇప్పుడు కుబేరకు ఆ స్థాయిలో కాకపోయినా ఎక్స్ వేదికగా చిన్నపాటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates