తెలుగు దర్శకుల కేకులు…తమిళ డైరెక్టర్ల షాకులు

మనమేమో బంగారం ఇస్తుంటే వాళ్ళమో ఇత్తడి బదులు చేస్తునట్టుగా ఉంది టాలీవుడ్, కోలీవుడ్ మధ్య దర్శకుల ఎక్స్ ఛేంజ్. మన డైరెక్టర్లను తమిళ హీరోలు భలేగా పట్టేసుకుని బ్లాక్ బస్టర్లు కొట్టేస్తుంటే మనోళ్లు డిజాస్టర్లు కోరి మరీ తెచ్చుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా విడుదలైన కుబేరకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ అడ్వాన్స్ బుకింగ్స్ ముందు ఆశించిన స్థాయిలో లేవు. ఎందుకంటే శేఖర్ కమ్ముల అక్కడి జనాలకు అంతగా పరిచయం లేని బాపతు కావడం. కట్ చేస్తే ధనుష్ లోని బెస్ట్ పెర్ఫార్మర్ ని బయటికి తీయడమే కాక థియేటర్లకు జనాలు వచ్చే హిట్ ఇచ్చాడు.

ఇదే ధనుష్ గతంలో సార్ రూపంలో మరో హిట్టు అందుకుంది కూడా మన వెంకీ అట్లూరితోనే. దుల్కర్ సల్మాన్ కు తిరుగు లేని బ్లాక్ బస్టర్ ఇచ్చింది, ఇప్పుడు సూర్య 47 చేస్తుంది కూడా ఇతనే. గతంలో కార్తీ, నాగార్జునతో తోలా (ఊపిరి) తీసిన వంశీ పైడిపల్లి ఇక్కడి నుంచి వెళ్లినవాడే. తర్వాత విజయ్ తో వారిసు (వారసుడు) చేసే రేంజ్ కి ఎదిగాడు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన సంగతి చూద్దాం. శంకర్ ని నమ్మి గేమ్ చేంజర్ చేసిన రామ్ చరణ్ కు మర్చిపోలేని పీడకల మిగిలింది. వెంకట్ ప్రభుని గుడ్డిగా ఫాలో అయినందుకు నాగ చైతన్యకు కస్టడీ రూపంలో సులభంగా మర్చిపోలేని సూపర్ ఫ్లాప్ పడింది.

అంతకు ముందు మురుగదాస్ ని బ్లైండ్ గా నమ్మేయడం వల్ల మహేష్ బాబుకి దక్కిన స్పైడర్ ని ఫ్యాన్స్ కలలో కూడా తలుచుకోరు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ది వారియర్ దర్శకుడు లింగుస్వామి ఎక్కడివాడో వేరే చెప్పనవసరం లేదు. కోలీవుడ్ హీరోలు చాలా తెలివిగా ఎంపికలు చేసుకుంటుండగా మనోళ్లు మాత్రం కేవలం బ్రాండ్లు కాంబినేషన్లు నమ్మి మోసపోతున్న దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఖుషి, తొలిప్రేమ లాంటివి తీసింది ఇదే తమిళ దర్శకులు కావొచ్చు. కానీ ఇప్పుడలాంటి ఫలితాలు రిపీట్ కావడం లేదు. మనమేమో ఖరీదైన కూల్ కేకులు ఇస్తుంటే వాళ్ళు మాత్రం కరెంటు షాకులు ఇస్తున్నారు.