టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు తేడా కొడుతున్నా.. కొన్ని చిత్రాలు మాత్రం అదిరిపోయే వసూళ్లు సాధిస్తూ థియేటర్లను కళకళలాడిస్తున్నాయి. ఇటీవల ‘ఖలేజా’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. గత వీకెండ్లో కూడా తొలి ప్రేమ, అందాల రాక్షసి రీ రిలీజ్ అయ్యాయి. వాటికి స్పందన కూడా పర్వాలేదు. ఇక తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రీ రిలీజ్‌ల్లో ‘ఏమాయ చేసావె’ ఒకటి.
15 ఏళ్ల కిందట యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని నాగచైతన్య, సమంతలకు పెద్ద బ్రేక్ ఇచ్చిన ఈ చిత్రాన్ని ఈ నెల 18న మళ్లీ థియేటర్లలోకి తీసుకు రాబోతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రీ రిలీజ్ కొంచెం పెద్ద స్థాయిలోనే ఉండబోతోంది. ఐతే రీ రిలీజ్‌కు హైప్ పెంచేందుకు ‘ఏమాయ చేసావె’ టీం కూడా రంగంలోకి దిగుతోందని.. నాగచైతన్యతో కలిసి సమంత కూడా ఒక ప్రమోషనల్ ప్రెస్ మీట్లో పాల్గొంటుందని ఊహాగానాలు రావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ అందులో వాస్తవం లేదని సమంత తేల్చేసింది.
చైతూ పేరు ఎత్తకుండా తాను ‘ఏమాయ చేసావె’ ప్రమోషన్లలో పాల్గొనడం లేదని ఆమె స్పష్టంచేసింది. ‘‘చిత్ర బృందానికి చెందిన వ్యక్తులతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియదు. ఆ సినిమాను ఇష్టపడే వాళ్లు.. నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల దృష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు’’ అని సమంత పేర్కొంది. తమిళంలో చేసిన ‘మాస్కోవిన్ కావేరి’ సమంత తొలి చిత్రం అయినా.. ‘ఏమాయ చేసావె’తోనే ఆమెకు బ్రేక్ వచ్చింది. ‘మాస్కోవిన్ కావేరి’కి సంబంధించి తనకు ఏదీ గుర్తు లేదని.. కానీ ‘ఏమాయ చేసావె’ మూమెంట్స్ అన్నీ ఇంకా బాగా గుర్తున్నాయని సామ్ చెప్పింది. జెస్సీ-కార్తీక్ మీద తీసిన ఇంటి గేట్ సీన్ తన తొలి షాట్ అని ఆమె గుర్తు చేసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates