దేశవ్యాప్తంగా సినిమాల సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. బాలీవుడ్‌ను మించి ఎదిగిపోయాం అని జబ్బలు చరుచుకుంటున్నాం కానీ.. తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కూడా దారుణంగా పడిపోతున్న విషయం గుర్తించట్లేదు. సినిమాల బడ్జెట్లు పెరిగాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తున్నాయి కానీ.. ఓవరాల్‌లో మన సినిమాల సక్సెస్ రేట్ మాత్రం దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది ఆరో నెలలో సగం రోజులు గడిచిపోగా.. నిఖార్సయిన హిట్లు అరడజను కూడా లేవంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఆశలు రేకెత్తిస్తున్న జానర్.. కామెడీ. ఐతే ఆ కామెడీ కూడా ఒకప్పుడు చేసిన స్టయిల్లో చేస్తే వర్కవుట్ కావట్లేదు. ప్రస్తుతం కామెడీ స్టయిల్ పూర్తిగా మారిపోయింది.
లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే.. ఇదీ ప్రస్తుతం కామెడీ సినిమాలు అనుసరిస్తున్న ఫార్ములా. ఈ ఏడాది హిట్ అనిపించుకున్న నాలుగు చిత్రాల్లో మూడు కామెడీ జానర్లో తెరకెక్కినవే కావడం విశేషం. కోర్ట్ ఒక్కటి సిరియస్ సినిమా కాగా.. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వేసవిలో విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’, ‘సింగిల్’.. ఈ మూడు చిత్రాల్లో పెద్దగా కథంటూ ఉండదు. లాజిక్స్ అసలే కనిపించవు.
రవ్వంత కూడా సెంటిమెంట్, డ్రామా లేకుండా.. జాలీ రైడ్ లాగా సాగిపోతాయి ఈ చిత్రాలు. కథాకథనాల్లో రూల్స్ ఏమీ పాటించకుండా.. కేవలం నవ్వించడమే ధ్యేయంగా ప్రతి సన్నివేశం సాగిపోతుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన మీమ్స్‌ను, ట్రెండీ మాటలను ఈ సినిమాల్లో బాగా వాడుకున్నారు. ఈ తరహా జాలీ కామెడీ మీద టాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు దృష్టిసారించడానికి గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు దోహదం చేశాయి. జాతిరత్నాలు, మ్యాడ్, ఆయ్, మత్తు వదలరా-2 లాంటి చిత్రాలను ఈ కోవలో చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం యూత్ చూస్తే పెద్ద హీరోలు చేసే ఈవెంట్ సినిమాలు చూస్తున్నారు. లేదంటే.. ఇలాంటి మ్యాడ్ ఫన్ ఉన్న సినిమాలకు ఓటేస్తున్నారు. ఈ టైపు సినిమాల్లో పెద్దగా కథ లేకపోయినా.. వేరే ఆకర్షణలు లేకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండు గంటలు థియేటర్లలో కూర్చుని జాలీగా నవ్వుకుని బయటికి వస్తే చాలని అనుకుంటున్నారు. అందుకే క్రిటిక్స్ మెచ్చకపోయినా.. ఈ సినిమాలపై విమర్శలు వచ్చినా.. వాటికి పట్టం కడుతున్నారు. ఈ ట్రెండును అర్థం చేసుకునే టాలీవుడ్లో ఈ తరహా ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ సినిమాలు మరిన్ని తయారవుతున్నాయి. లేటెస్ట్‌గా టీజర్‌తో పలకరించిన ‘మిత్రమండలి’ సైతం ఈ టైపు జాలీ సినిమాలాగే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates