మహాభారతం సినిమా చేశాక తాను రిటైరైపోతానంటూ వస్తున్న వార్తలను బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఖండించాడు. తాను అలా ఎప్పుడూ చెప్పలేదని.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమిర్ అన్నాడు. మహాభారతం ఆమిర్ కలల ప్రాజెక్టుల్లో ఒకటి. దీని మీద కొన్నేళ్ల నుంచి తన టీంతో కలిసి పని చేస్తున్నాడు.
స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టును సెట్స్ మీదికి తీసుకెళ్తామని ఆమిర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతే కాక.. ఈ సినిమా చేశాక ఇక తాను ఇండస్ట్రీలో చేయడానికి ఏమీ లేదనే భావన కలుగుతుందని అనుకుంటున్నానని, ఒక నటుడిగానే చనిపోవాలనుకుంటున్నానని ఆమిర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆమిర్‌కు ఇదే చివరి సినిమా అన్నట్లుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆమిర్ స్పందించాడు.
‘‘మహాభారతం నా చివరి చిత్రం కాదు. నా సమాధానాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘మీరు ఏదైనా సినిమా తర్వాత నటనకు స్వస్తి చెప్పే అవకాశం ఉందా’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాను. ఒక కళాకారుడిగా నాకు సంతృప్తినిచ్చే ఏ పాత్రనైనా చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏదైనా పాత్ర సంతృప్తినిస్తే సంతోషంగా వెళ్లిపోతాను అని చెప్పా.
దీంతో అందరూ ఆ పాత్ర మహాభారతంలోనిదని, ఆ తర్వాత నేను ఇక నటించనని అనుకున్నారు. నా సమాధానాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతున్నా’’ అని ఆమిర్ అన్నాడు. ఆమిర్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనకరాజ్-రజినీకాంత్ చిత్రం ‘కూలీ’లోనూ ఆయన ఒక క్యామియో రోల్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates