దర్శకుడు, నటుడు ఏఎస్ రవికుమార్ చౌదరి నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూయడం పరిశ్రమను షాక్ కి గురి చేసింది. 2004లో యజ్ఞంతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన రవికుమార్ చౌదరి డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ కి మాస్ హీరో ఇమేజ్ రావడానికి బలమైన పునాది వేసింది ఈ సినిమానే. ప్రధాన కేంద్రాల్లో వంద రోజులకు పైగా ఆడింది. దీంతో బాలకృష్ణతో వీరభద్ర చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే ఓవర్ మాస్ ఎలిమెంట్స్ వల్ల ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ పరాజయం రవికుమార్ చౌదరి అవకాశాల మీద ప్రభావం చూపించింది.
నితిన్ ఆటాడిస్తా సైతం ఆశించిన ఫలితం అందుకోలేదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలినాళ్ళలో నటించిన చిత్రమిది. ఈ టైంలో తనను తాను ప్రూవ్ చేసుకునే లక్ష్యంగా తనీష్ తో ఏం పిల్లో ఏం పిల్లడోని తనకు అచ్చివచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తే అది కూడా ఫ్లాప్ గా నిలిచిపోయింది. దీంతో రవికుమార్ చౌదరి కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. తిరిగి సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితంతో చాలా గ్యాప్ తర్వాత విజయం అందుకున్నారు. తొలుత శ్రీహరిని తీసుకుని ఆయన హఠాత్తుగా కన్నుమూస్తే జగపతిబాబుతో మళ్ళీ రీ షూట్ చేసినా సూపర్ హిట్ కొట్టడం ప్రేక్షకులను మెప్పించింది.
2015లో తనకు బ్రేక్ ఇచ్చిన అభిమానంతో రవికుమార్ చౌదరికి గోపీచంద్ సౌఖ్యం ఇచ్చాడు. కానీ దెబ్బ పడింది. తర్వాత పదేళ్లపాటు డైరెక్షన్ కు దూరంగా ఉన్న రవికుమార్ చౌదరి గత ఏడాది రాజ్ తరుణ్ తిరగబడరా సామీతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. కమర్షియల్ అంశాలను హ్యాండిల్ చేసిన తీరు జనాన్ని మెప్పించలేకపోయింది. సుకుమార్ జగడంలో ప్రదీప్ రావత్ అసిస్టెంట్ గా రవికుమర్ చౌదరి వేసిన పాత్ర నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. వ్యక్తిగతంగా రవికుమార్ కొన్ని వివాదాలు తెచ్చుకున్న దాఖలాలున్నాయి. తొలి చిత్రం యజ్ఞం ద్వారా ఇద్దరు హాస్య నటులకు నంది అవార్డులు తెచ్చిన ఘనత రవికుమార్ చౌదరిది.