ఊహించని స్థాయిలో అతి పెద్ద డిజాస్టర్ వైపు పరుగులు పెడుతున్న థగ్ లైఫ్ దెబ్బ వివిధ రూపాల్లో తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా దీని ప్రభావం ఇండియన్ 3 నేరుగా చూపించబోవడం అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అదెలాగో చూద్దాం. ఇండియన్ 2 దారుణమైన ఫలితం అందుకున్నాక శంకర్ బ్రాండ్ మీద మార్కెట్ లో డ్యామేజ్ ఏర్పడింది. సరే ఇలాంటి ఫ్లాపులు అందరికీ వస్తాయని జనాలు సర్దిచెప్పుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ చూశాక శంకర్ మీదున్న నమ్మకం ట్రేడ్ లోనూ సున్నా అయిపోయింది. ఒకప్పటి బ్రిలియంట్ క్రియేటర్ ఆయనలో లేడని కమల్ హాసన్, రామ్ చరణ్ సినిమాలు ఋజువు చేశాయి.
ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే ఇండియన్ 2 గాయం పెద్దదే అయినా మణిరత్నం కాంబినేషన్ కాబట్టి థగ్ లైఫ్ తో రికవర్ కావొచ్చని భావించారు. కానీ ఇప్పుడది జరగలేదు. దీంతో ఇటు శంకర్, అటు కమల్ ఇద్దరి ట్రాక్ రికార్డులు దారుణంగా దెబ్బ తిని ఇండియన్ 3 మీద ఉన్న కాసిన్ని ఆశలను ఆవిరి చేశాయి. ఒకవేళ థగ్ లైఫ్ కనీసం యావరేజ్ అయినా ఏ దసరాకో దీపావళిలో ఇండియన్ 3ని తీసుకొచ్చి కాసింత ఊరట పొందేవాళ్ళు. ఇప్పుడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయని చెన్నై టాక్. థియేటర్ల సంగతేమో కానీ నేరుగా ఓటిటికి మంచి రేట్ కి అమ్మేసి టెన్షన్ తగ్గించుకోవడం ఉత్తమమని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ తో కనీసం తమిళంలో అయినా కంబ్యాక్ అయ్యారని భావించిన మణిరత్నం ఇప్పుడీ థగ్ లైఫ్ పుణ్యమాని మళ్ళీ మొదటికే వచ్చేశారు. నెక్స్ట్ చేయబోయే సినిమా శింబుతో దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. నవీన్ పోలిశెట్టితో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ తర్వాత అది నిజం కాదని తేలింది. జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఆ రకంగా చూస్తే నవీన్ లక్కీనేనని చెప్పాలి. మరి ఇండియన్ 3కి ఎప్పుడు మోక్షం దక్కుతుందో సమాధానం చెప్పాల్సింది కాలమే. గేమ్ ఛేంజర్ దెబ్బకు శంకర్ బయట కనిపించడం తగ్గించేశారు. ఇక కమల్ హాసన్ దర్శనం ఇప్పట్లో దొరకడం కష్టమే.