ఇప్పటి దర్శకులకు ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయింది. పెద్ద హీరోలతో చేయడం వల్ల కావొచ్చు లేదా స్క్రిప్ట్ పరంగా జరిగిన ఆలస్యం కావొచ్చు కారణాలు ఏమైతేనేం రాజమౌళి నుంచి నాగ్ అశ్విన్ దాకా అందరికీ ఇదే సమస్య. కానీ క్రిష్ మాత్రం అనుకోకుండా ఒక అరుదైన ఘనత దక్కించుకున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం కావడం స్పెషలని చెప్పాలి. జూన్ 12 రాబోతున్న హరిహర వీరమల్లు వాటిలో మొదటిది. ప్రస్తుతం డైరెక్ట్ చేసింది జ్యోతికృష్ణనే అయినా ఈ ప్రాజెక్టుతో క్రిష్ మూడేళ్ళకు పైగా ప్రయాణం చేశారు. టైటిల్ కార్డులో పేరు ఉంది.
నాలుగు వారాలు తిరగకముందే జూలై 11న అనుష్క ఘాటీ తెరమీదకు వచ్చేస్తుంది. ఇది క్రిష్ సోలోగా చేసిన మూవీ. రెండు పెద్ద బడ్జెట్లే. మెగా సూర్య ప్రొడక్షన్స్, యువి క్రియేషన్స్ దేనికవే భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న బ్యానర్లు. ట్విస్ట్ ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్, అటు అనుష్క ఇద్దరూ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ఒకటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాగా మరొకటి లేడీ డాన్ సెటప్ లో రూపొందింది. ప్రస్తుతానికి క్రిష్ బయట కనిపించడం లేదు. వీరమల్లు ప్రమోషన్లలో ఏమైనా వస్తాడేమో ఇంకా సరైన సమాచారం లేదు. చూస్తుంటే వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి.
హరిహర వీరమల్లు, ఘాటీ రెండూ కనక హిట్టయితే క్రిష్ దశ తిరిగినట్టే. ఎందుకంటే వైష్ణవ్ తేజ్ కొండపొలం తర్వాత కెరీర్ పరంగా స్లో అయిపోయిన క్రిష్ మీద పవన్ మూవీ ప్రభావం చాలా పడింది. ఎక్కువ సమయం ఖర్చు పెట్టడంతో సినిమాలు వేగంగా తీసే ఛాన్స్ లేకపోయింది. ఘాటీ అనుకున్న టైం కన్నా వేగంగానే పూర్తి చేయడం కొంత రిలీఫ్. వీరమల్లులో క్రిష్ కంట్రిబ్యూషన్ ఎంతనేది అంత సులభంగా తెలియకపోవచ్చు. జ్యోతికృష్ణ ఎంత హ్యాండిల్ చేశాడనేది కూడా సస్పెన్సే. ఘాటీ క్రెడిట్ మాత్రం పూర్తిగా క్రిష్ కే దక్కుతుంది కాబట్టి ఈ రెండు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.