ఒకే ఒక జీవితం హిట్ తర్వాత స్పీడ్ పెంచుతాడనుకున్న శర్వానంద్ మూడేళ్ళ కాలంలో మనమే మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఆశించిన ఫలితం అందుకోలేదు. మధ్యలో పెళ్లి తదితర కారణాల వల్ల గ్యాప్ ఎక్కువ తీసుకున్న శర్వా ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీద ఉంచాడు. వాటిలో మొదటిది నారి నారి నడుమ మురారి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో ఇద్దరి భామల మధ్య నలిగిపోయే మధ్య వయసు యువకుడి పాత్రలో శర్వాని హిలేరియస్ గా చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే ఇప్పటిదాకా దీని రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు.
కారణం ఏంటయ్యా అంటే ఓటిటి డీల్ కు సంబంధించి ఇటీవలే ఒప్పందం కుదిరిందట. కేవలం ఒక పది రోజుల ప్యాచ్ వర్క్ మినహాయించి మొత్తం పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న భాగాన్ని ఈ మధ్యే చూసిన ఒక ఓటిటి సంస్థ ప్రతినిధులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారట. అగ్రిమెంట్ సంతకాలు కాగానే థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య నారీలుగా నటిస్తున్న ఈ ఫన్ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. నెల రోజుల క్రితమే ఒక లిరికల్ సాంగ్ వదిలారు.
బాలకృష్ణ 1990 సూపర్ హిట్ టైటిల్ ని వాడుకుంటున్న శర్వానంద్ ఈసారి ఒకే ఒక జీవితం కన్నా పెద్ద హిట్టు కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. దీని తర్వాత అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న బైక్ బ్యాక్ డ్రాప్ మూవీ వేగమందుకుంటుంది. జానీ టైటిల్ ని దీనికి పరిశీలిస్తున్నారు. ఇకపై ఎక్కువ గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు చేయడానికి కమిటవుతున్న శర్వానంద్ సంపత్ నంది డైరెక్షన్లో భోగిగా ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో ఈ మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటి తర్వాత ఎవరితో చేయాలనే దాని గురించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి.