ఖలేజా మొదటి రోజు – మిస్సయిన మైలురాయి

నిన్న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భైరవం, షష్టిపూర్తి లాంటి కొత్త సినిమాలున్నప్పటికీ డామినేషన్ మొత్తం ఖలేజా రీ రిలీజ్ దే అయ్యింది. మెయిన్ సెంటర్స్ లో షోలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా స్పెషల్ ప్రీమియర్లు ఏదో మహేష్ బాబు కొత్త మూవీ రిలీజయ్యిందనే రేంజ్ లో సందడి చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సెలబ్రేషన్ తాలూకు వీడియోలు హల్చల్ చేశాయి. అక్కడక్కడా ఫ్యాన్స్ కొందరు శృతి మించినప్పటికీ ఓవరాల్ గా ఖలేజాకు దక్కిన స్పందన పెద్దదే. కానీ ఓపెనింగ్ డే రికార్డు పరంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ని దాటలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఖచ్చితమైన నెంబర్లు వెలువడకపోయినా రెండింటి మధ్య మొదటి రోజు వసూళ్లకు సంబంధించి రెండు కోట్ల దాకా వ్యత్యాసం ఉండొచ్చని అంటున్నారు. ఖలేజాకు ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అది మాస్ సినిమా కాదు. సదాశివ సన్యాసి, పిలిచే పెదవులపైనా పాటలు  మినహాయించి మిగిలిన సాంగ్స్ మణిశర్మ బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో ఉండవు. పైగా ఒక్కడు, పోకిరి తరహాలో మాస్ ఎలివేషన్లు తక్కువ. దీని వల్ల సహజంగా ఒక మాస్ వర్గం ఖలేజాని మళ్ళీ తెరమీద చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇది బిసి సెంటర్ల కలెక్షన్లు, అంకెల్లో కనిపించింది. గబ్బర్ సింగ్ కు ఈ సమస్య రాలేదు.

సో ఎంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నా ఖలేజా మొదటి రోజు మైలురాయిని మిస్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ 9 కానుంది. ఖలేజాలో ఉన్న బలహీనతలన్నీ అతడులో కవరవుతాయి. పైగా మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న దానికి రెట్టింపు రచ్చ చేయడం ఖాయం. పాటలు, ఫైట్లు, త్రివిక్రమ్ డైలాగులు, బ్రహ్మానందం కామెడీ, మహేష్ బాబు సెటిల్డ్ హీరోయిజం ఇలా చాలా అంశాలు పైసా వసూల్ చేయిస్తాయి. మహేష్ అభిమానులు కూడా దాన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సిద్ధం చేసి పెట్టుకున్న అతిథి రీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.