టాలీవుడ్ టాక్ : పవన్ కళ్యాణ్ రెండో లేఖ

థియేటర్ల బందు, హరిహర వీరమల్లు చుట్టూ ముసురుకున్న ఇష్యూ, బడా నిర్మాతల ప్రెస్ మీట్లు, పరిశ్రమలో అంతర్గతం పోరు వగైరా విషయాలతో గత పది రోజులు ఈ టాపిక్స్ చుట్టూ డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిటర్న్ గిఫ్ట్ పేరుతో వచ్చిన లేఖ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. దిల్ రాజు అంతటి సీనియర్ మాకు పవన్ పెద్దన్నని, ఆయన ఏమన్నా పడతామని, అక్కడిదాకా మా వాళ్లే ఈ ఎపిసోడ్ లాకొచ్చారని చెప్పడం నిన్నటి ట్విస్టు. తాజాగా డిప్యూటీ సిఎం నుంచి మరో ప్రెస్ నోట్ కం లెటర్ విడుదలయ్యింది. ఈసారి మరిన్ని అంశాలు జోడించారు.

దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఇకపై ఏ నిర్మాతైనా టికెట్ రేట్లు పెంపు గురించి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తే అది కేవలం చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే జరగాలి. వ్యక్తిగతంగా ఎలాంటి మీటింగులు ఉండవు. ఎలాంటి విన్నపానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. తన హరిహర వీరమల్లుకైనా సరే సదరు ప్రొడ్యూసర్ సంబంధిత వ్యవస్థ ద్వారా ఆర్జీ పెట్టుకోవాలి తప్పించి పర్సనల్ గా ఫేవర్లు ఉండవు. ప్రేక్షకులను సినిమా హాలుకు రాకుండా చేస్తున్న ఆహార పదార్థాలు, శీతల పానీయాల ధరలు, థియేటర్లలో వసతులు సౌకర్యాలు తదితరాలన్నీ ఇకపై ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తనిఖీ చేయించబడతాయి.

ఇక థియేటర్ల బందుకు సంబంధించి తొలి కదలిక తూర్పుగోదావరి జిల్లాలో మొదలయ్యిందనే వార్తల నేపథ్యంలో దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేయబోతున్నారు. బెదిరింపు ధోరణిలో వ్యాపారాలు చేస్తున్న టాలీవుడ్ పెద్దల గురించి వాకబు చేయడం పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ఇలాంటి అనారోగ్య వాతావరణం సృష్టిస్తున్న వాళ్ళ గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా అసోసియేషన్, దర్శకుల సమాఖ్యకు తెలియజేసేలా చర్యలు తీసుకోబోతున్నారు. చాలా సవివరంగా, స్పష్టంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న అంశాలు ఇండస్ట్రీలో పెను మార్పులకు దారి తీసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

ఇప్పటిదాకా చూసి చూడనట్టు వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఇకపై కఠినమైన ప్రొఫెషనలిజంని సినిమాటోగ్రఫీ శాఖలో తీసుకురావడం ద్వారా కొత్త మార్పుకు దారి చూపినట్టు అయ్యింది. ఇకపై మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా హైకులు అడిగే నిర్మాతలు కాస్త ముందు వెనుకా ఆలోచించడం మొదలుపెడతారు. ఆడియన్స్ జేబులకు చిల్లులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు సైతం ఈ వార్నింగ్ కనక పని చేస్తే మంచి సౌకర్యాలకు మార్గం దొరికినట్టు అవుతుంది. ఒక ప్రణాళికబద్దంగా పవన్ కళ్యాణ్ తీసుకు రావాలనుకుంటున్న మార్పు టాలీవుడ్ లో ప్రతి ఒక్కరిలో వస్తే మంచి రోజులు వచ్చేసినట్టే.