సాధారణ అభిమానులకే కాదు.. ఫిలిం సెలబ్రెటీలకు కూడా ఫేవరెట్లు ఉంటారు. వాళ్లు సైతం తమ అభిమాన కథానాయకులను చూస్తే ఎగ్జైట్ అవుతారు. వాళ్లను కలిసినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనవుతారు. తాను కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు కన్నడ సూపర్ స్టార్లలో లెజెండరీ నటుడు రాజ్ కుమార్ తనయుడైన శివరాజ్‌కు కమల్ హాసన్ అంటే అమితమైన ఇష్టమట. చిన్నతనంలో ఆయన్ని కలిసి హత్తుకున్న సందర్భంలో మూడు రోజులు స్నానం చేయకుండా ఉండిపోయినట్లు శివన్న కమల్ చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్లో వెల్లడించడం విశేషం.
“నా చిన్నపుడు ఒకసారి నాన్నను కలవడానికి కమల్ సార్ తొలిసారి మా ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న నా గురించి ఆయన ఆరా తీయగా.. నాన్న పరిచయం చేశారు. ఆ క్షణం ఆయన్ని ప్రేమగా హత్తుకున్నా. ఆ అనుభూతి చెదిరిపోకూడదని భావించి మూడు రోజుల పాటు స్నానం చేయలేదు. ఆయనంటే నాకంత ఇష్టం” అని శివన్న వెల్లడించాడు.
తాను క్యాన్సర్ బారిన పడినపుడు.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా కమల్ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆయన మాట్లాడుతుంటే ఎంతో ధైర్యంగా అనిపించిందని శివరాజ్ వెల్లడించారు. ఆ సమయంలో కమల్ ‘శివన్నా.. నీకు తెలుసా. నీతో మాట్లాడుతుంటే నాకెందుకో కన్నీళ్లు వస్తున్నాయని’ అన్నారని. ఆ క్షణం తనకు తన తండ్రితో మాట్లాడుతున్నట్లే అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు శివరాజ్ కుమార్. కమల్ హీరోగా మణిరత్నం రూపొందించిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. త్రిష, శింబు, జోజు జార్జ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. కమల్, మణిరత్నం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates