మెగా ఫాన్స్ కలలో కూడా మర్చిపోని డిజాస్టర్ భోళా శంకర్. చిరంజీవి ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. మెహర్ రమేష్ దర్శకత్వం, మహతి స్వరసాగర్ సంగీతం, తమన్నా గ్లామర్, కీర్తి సురేష్ సెంటిమెంట్ ఇవేవి బొమ్మ బోల్తా పడకుండా కాపాడలేకపోయాయి. ట్విస్ట్ ఏంటంటే దీన్ని ముందు ప్లాన్ చేసుకున్నది పవన్ కళ్యాణ్ తో. తమిళ ఒరిజినల్ వెర్షన్ నిర్మించిన ఏఎం రత్నం దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసి తెలుగులో పవర్ స్టార్ అయితే బాగుంటుందని భావించారు. అయితే ఆ టైములో ఎన్నికలు అడ్డురావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాల్సి వచ్చింది.
దీనికన్నా ముందు పవన్ స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రాహి అనే మూవీని అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలయ్యాక ఆపేయాల్సి వచ్చింది. డైరెక్షన్ చేసే పరిస్థితిలో పవన్ లేకపోవడంతో దాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం ఇష్టం లేక పూర్తిగా ఆపేశారు. లేదంటే జానీ తర్వాత పవన్ దర్శకత్వం వహించిన సినిమాగా సత్యాగ్రహి నిలిచిపోయేది. ఈ సినిమాతో పాటు వేదాళం రీమేక్ మిస్ చేసుకున్న ఏఎం రత్నంకు కమిట్ మెంట్ బాకీ ఉన్న పవన్ దాన్ని హరిహర వీరమల్లుతో తీరుస్తున్నారు. వీళ్ళ కలయికలో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్టుతో పాటు బంగారం లాంటి కమర్షియల్ మూవీ వచ్చాయి. రెండోది అంత విజయం సాధించలేదు.
ఒకవేళ నిజంగానే రత్నం కనక వేదాళం తెలుగులో పవన్ తో తీసి ఉంటే భోళా శంకర్ గండం మెగాస్టార్ కు తప్పేది. అజిత్ నటించిన ఒరిజినల్ లోనే పరమ రొటీన్ కథా కథనాలు ఉంటాయి. అలాంటిదాన్ని మళ్ళీ తీయాలనుకోవడమే పెద్ద రిస్క్. కాకపోతే దాన్ని అనిల్ సుంకర మోయాల్సి వచ్చింది. గతంలో అతడు, ఇడియట్ బ్లాక్ బస్టర్స్ కి నో చెప్పి అవి ఇతర హీరోలకు వెళ్లేలా చేసిన పవన్ వేదాళం రీమేక్ మాత్రం అన్నయ్య చేయడం బహుశా ఊహించి ఉండరు.. భోళా శంకర్ దెబ్బ ఏ స్థాయి అంటే చిరంజీవి కొత్త సినిమా రావడానికి కొంచెం అటుఇటుగా రెండు సంవత్సరాల సమయం పట్టింది. ఇదంతా విధి లిఖితం.