-->

నాని.. ఓపెనింగ్ అదుర్స్.. ఫినిషింగ్ ప్చ్

టాలీవుడ్లో సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తన సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి. బిజినెస్ పెరుగుతోంది. ఓపెనింగ్స్‌లోనూ గ్రోత్ ఉంటోంది. వరుసగా తన సినిమాలకు ప్రి రిలీజ్ బజ్ బాగుంటోంది. అలాగే పాజిటివ్ టాక్ వస్తోంది. ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండట్లేదు. ‘దసరా’తో మొదలుపెడితే.. ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్-3’ ఇలా వరుసగా నాలుగు చిత్రాలకూ పాజిటివ్ టాక్ వచ్చింది. ‘హాయ్ నాన్న’ పక్కా క్లాస్ మూవీ కావడం వల్ల ఓపెనింగ్స్, కలెక్షన్లు కొంచెం తక్కువ వచ్చాయి కానీ.. మిగతా మూడు సినిమాలూ నాని స్టార్ పవర్‌ను చూపించాయి. తన ఇమేజ్‌ను పెంచాయి.

‘దసరా’తో తొలిసారిగా వంద కోట్ల క్లబ్బులోనూ అడుగుపెట్టాడు నాని. ఇప్పుడు ‘హిట్-3’తో మరోసారి ఆ మైలురాయిని అందుకున్నాడు. కానీ నాని సినిమాలకు ఉన్న సమస్యల్లా.. ఆరంభ జోరు తర్వాత డౌన్ అయిపోవడమే.
నాని చిత్రాలకు వచ్చే టాక్, ఓపెనింగ్స్ చూస్తే ఫుల్ రన్లో పెద్ద రేంజికి వెళ్తాయనే అంచనాలు కలుగుతున్నాయి. కానీ వీకెండ్ తర్వాత తన సినిమాలు చల్లబడిపోతున్నాయి. అనుకున్నంత జోరు చూపించలేకపోతున్నాయి. ఇప్పుడు చాలా సినిమాల సమస్య ఇదే అయినప్పటికీ.. నానికి ప్రతిసారీ ఈ ఇబ్బంది తప్పట్లేదు. మంచి లాభాలు అందిస్తాయి అనుకున్న సినిమాలు.. చివరికి అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకోవడం లేదా కొంత మేర నష్టాలు మిగల్చడం కామన్ అయిపోతోంది.

‘దసరా’కు ఏపీలో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ‘సరిపోదా శనివారం’ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు ‘హిట్-3’ పరిస్థితి కూడా ఇంతే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తూర్పు గోదావరిలో ‘హిట్-3’ రూ.50 లక్షల మేర నష్టం తెచ్చిపెట్టిందని డిస్ట్రిబ్యూటర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నైజాంలో సినిమాకు లాభాలు వచ్చినా, ఉత్తరాంధ్రలో కష్టం మీద బ్రేక్ ఈవెన్ అయినా.. మిగతా ప్రాంతాల్లో ‘హిట్-3’కి నష్టాలు తప్పలేదు. మొత్తానికి నాని ఓపెనింగ్స్‌లో ఎంత దూకుడు చూపిస్తున్నప్పటికీ.. ఫినిషింగ్ మాత్రం ప్రతిసారీ తడబడుతున్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’తో అయినా ఈ సమస్యను అధిగమించి క్లీన్ హిట్ ఇస్తాడేమో చూడాలి.