టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్ కొన్నేళ్లుగా ఒక ప్రాజెక్టులో స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. అదే.. ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్.. మళ్లీ అదే హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఎంతో సంబరపడ్డాడు. ఈ కలయికలో ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది అనుకున్నట్లుగా ముందుకు కదల్లేదు. దీంతో ఆ కథను పక్కన పెట్టేసి తమిళ హిట్ ‘తెరి’ రీమేక్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో కొత్తగా మొదలుపెట్టారు. కానీ ఆ సినిమాకు ముహూర్త వేడుక జరిగి కూడా ఏళ్లు గడిచిపోతోంది. షూట్ మొదలైందే చాలా లేటుగా. మళ్లీ బ్రేకులు పడిపోయాయి. పవన్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరై ఏడాదిన్నర దాటింది.
ఇటీవల తన పెండింగ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా క్లియర్ చేసే పనిలో పడ్డాడు పవన్. అందులో భాగంగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ‘ఓజీ’ షూట్‌కు హాజరవుతున్నాడు. జూన్ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు కూడా కాల్ షీట్స్ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
కానీ ఈ సినిమా షూట్ పున:ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు రాగానే నెటిజన్లు డ్యూటీ ఎక్కేశారు. హరీష్ శంకర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. హరీష్ చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం గురించి ఎద్దేవా చేస్తూ ‘ఉస్తాద్’ పరిస్థితి ఏంటో అని నిట్టూరుస్తున్నారు. మామూలుగా గట్టిగా రిటార్ట్ ఇచ్చే హరీష్.. ఈసారి కూల్‌గా జవాబిచ్చాడు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో తాను ది బెస్ట్ ఇస్తానని.. సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నాడు. కానీ ఈ సినిమాను హిట్ చేయడం అతడికి మామూలు టాస్క్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు అస్సలు వర్కవుట్ కాలేదు. పైగా ‘తెరి’ హిందీ రీమేక్ ‘బేబీ జాన్’ బోల్తా కొట్టింది. స్వయంగా అట్లీ అన్నీ తానై చూసుకున్నా ఈ ప్రాజెక్టు అక్కడ వర్కవుట్ కాలేదు. మరోవైపు రీమేక్‌లు తీయడంలో తిరుగులేదని పేరున్న హరీష్ సైతం ‘మిస్టర్ బచ్చన్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇక ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్న సీనియర్ దర్శకుడు దశరథ్ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్క్రిప్టు రాసి చాలా కాలం అయింది. ఇది రిలీజయ్యే సమయానికి ట్రెండే మారిపోయి ఉండొచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీష్ ఏమేర గట్టెక్కిస్తాడో చూడాలి మరి.